కష్టమైన సుఖమైన

విజయ గోలి  గజల్

కష్టమైన సుఖమైన అందరితో పంచుకుంది
బ్రతుకులలొ తీయదనం బాటేమిటొ ఎంచుకుంది

మట్టిమిద్దె గట్టితనం దొంగకెపుడు దొరకనిదే
తాతఇల్లు ఆ తరాల కోటలాగే నిలబడుంది

చద్దిముద్ద చల్లదనం ఆదమరుపు నిద్ర ఘనం
వేసవిలో సందెవేళ ఆనందం పంచుకుంది

అనురాగపు పలకరింపు అభిమానపు ఆదరింపు
గుండెనిండు గుర్తింపులు నిండుతనం నింపుతుంది

గోపురాన గువ్వలాడె గుడిగంటల సవ్వడిలో
ఒంటికన్ను ఇంటివెలుగు నేడేమిటొ తెలియకుంది

జమానాలు జల్దిగానే జరిగిపోయె జరఆగక
శిథిలాలలొ ప్రేమలనే చిత్రాలుగా చూపుతుంది

గిరిగీతలొ ఆనందపు గుట్టేమిటో ఎరుకలేదు
కలిసివున్న కలిమినెపుడు విజయాలుగ చెప్పుతుంది

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language