మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
*ఆవిర్భావం ..విజయ గోలి
శిల నువ్వే ఉలి నువ్వే
చెక్కవలసిన శిల్పం నీదే
చెక్క పోయే శిల్పి నువ్వే
ఆవిష్కరించు నిన్ను నీవు
ఉదయించే సూర్యుడిగానో
ఉరిమే మేఘంగానో
ఉప్పొంగే సంద్రంగానో
ఓరిమి పొంగే ఉర్విగానో
నిప్పుగానో నింగి గానో
ఏదైనా సరే అందులో నీవుండాలి
ఆవేశంతో ఉలి పట్టినా
ఆదరంతో దెబ్బ వేయి
నీకు తగ్గట్లుగ ఒదుగుతుంది
శిలలోనూ చైతన్యం వుంటుంది
అది కూడా చెమ్మగిల్లుతుంది
అంతర్గతంగా దర్శించనిదే
అడుగు దాగిన
అవిటితనం కనపడదు
పారదర్శకత ఉంటేనే
శిల్పం నిన్ను మించిన
అందాలతో అలరార్చ గలవు
ఉలి పట్టే ముందు
ఆశయాన్ని అధ్యయించు
ధ్యానంలో ధ్వనించు
ఆచరణలో అనునయించు
నీ చెదరని ఏకాగ్రత
నీ సృష్టికి దృష్టి
ప్రతి ఉలిదెబ్బ
ఒక ప్రతిభై ప్రభవించాలి
అపుడే నీఉనికి హిమాలయం..