*సిరా మరక*విజయ గోలి
మనసును మధిస్తున్న ..
స్పందనలన్నీ..స్వఛ్చత లేక సంధిగ్ధంలో..
సామూహికంగా సమరం చేస్తున్నాయి .
ఆశ..నిరాశల ..మధ్య..
నిశీధి నీడలలో తేలియాడే మిణుగురుల గుంపులా ..
తెల్లకాగితం పై ఒలికిన..
నల్ల సిరా మరకలా … …
ఎదుట నిలిచిన జీవితం ..
సిరా మరకని చిత్రంగా మలచాలని ..
మొక్కవోని తాపత్రయం …
కాలం గడిచిపోతుంది …
కాగితం నలిగిపోతుంది …
చేతగాని ఆక్రోశం కళ్లని తడిమి ..
కన్నీటి వరదల్ని కడలిలో కలిపేస్తుంది …
కాగితాన్ని ..కాల్చేయాలని ..
మరకని మంటల్లో మసి చేయాలనీ …
కుంగుబాటుకు ..లొంగిపోయిన మనసును.
వెన్ను తట్టిన వేదన …వేలు పట్టుకు నడిపింది..
కనిపించని రేపు ను కనుల ముందు..చూస్తూ ..
నిరాశల వెనుక ఆశను మాత్రమే చూస్తూ..
మిణుగురులో ..మెరుపును చూస్తూ ..
ఆలోచనలపై తిరుగుబాటు చేసిన ఆచరణలు ..
బలహీనతలోని ..బలానికి ఊపిరి పోస్తూ ..
గడిచిన …నిన్నని కప్పేస్తూ …
క్షణమాగని నేటి …లో ఎదురీదుతూ ..
నలిగిన కాగితం పై …సిరా మరకని..
చరిత్ర చూడని చిత్రంగా మార్చాలని ..
జాగృతిలోకి …సుస్థిర ప్రయాణం. విజయ గోలి