.గజల్. విజయ గోలి
జాబిలమ్మ ఎదురొచ్చి తడిమినదే సంబరముగ
రాధమ్మగ వెన్నెలలో తడిచినదే సంబరముగ
చెరువులోని చెంగలువలు చెక్కిలిపై చేరాయిలె
మందిరాన్ని సుందరంగ మలిచినదే సంబరముగ
నుదుటిపైన దినకరునే దిద్దుకుంది సుందరంగ
అధరాలపై నెలవంకను అలదినదే సంబరంగ
తారలనే తుంచుకొచ్చి దారులనే నిలుపుకుంది
ముంగిటనే రంగవల్లి అల్లినదే సంబరంగ
వాలుజడల వయ్యారమే విరజాజుల ఊగినదీ
యమునఅలల సొగసులనే సర్దినదే సంబరంగ
అడవిపూల మత్తుగాలి అందాలను తాకుతుంటె
మురిపముల మురళి కొరకు వేచినదే సంబరంగ
అక్షరాల కదంబాల కవనపూల “విజయ”మాల
కరుణించిన కన్నయ్యకు వేసినదే సంబరంగ