శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
సందెవేళలొ కాపుకాసి చందమామకు సంకెలేసా
పాలపుంతల పూలు పరిచి ప్రేమ నౌకకు లంగరేసా
రత్న సౌధం రంగు లేల…చలువ పందిరి ఛాయ మనదే
పూలగిన్నెల మధువునింపి ప్రణయ బాసల బంధమేసా
జిలుగు చీరకు బులుగు రవిక జట్టు చేసీ కట్టుకున్నా
తారలొలికిన తళుకు బెళుకు సిగ్గు బుగ్గల ముగ్గులేసా
మంచి గంధం మనసు నింపి మరులు కురిసెను నీలి మేఘం
కురుల ముడిచిన వలపు పూల(ను) తలపు మాలగ మెలికలేసా
హంస రెక్కల తేరు పైన తేటి నవ్వుగ తేలిరారా
విరులు జల్లే విజయాలకు ఇంద్ర ధనుస్సు రంగులేసా !!