గజల్ విజయ గోలి
శిశిరానికి చిగురుపూత పూసినదీ వసంతమై
మంచుతెరలు తొలగించీ మురిసినదీ వసంతమై
తొలిచూలు బరువులతో గున్నమావి గుబురులే
కోయిలమ్మ రాగాలతొ పాడినదీ వసంతమై
వెండిపూల వానమల్లే వేపపూలు జల్లులుగా
మధువులకై మధుపములే వాలినవీ వసంతమై
చిత్రమైన వర్ణాలతో సుమతావుల చందనాలు
అలరించే ఛైత్రమే ఆడినదీ వసంతమై
చెరకువింటి చెలికాడే గురిచూసిన విరిశరములు
వలపుజంట గుండెగుచ్చి విరిసినవీ వసంతమై
నిదురించే నిన్నలనే మేలుకొలుపు ఆమనిగా
షడ్రుచుల సంబరాల నిలిచినదీ వసంతమై
పల్లవించు ఆశలతో మామిడాకు తోరణాలు
ఉగాదికీ స్వాగతాలు పలికినవీ వసంతమై