గజల్ విజయ గోలి
వేగుచుక్క వెలుగులలో వేచినాను నీకోసం
ఉదయరేక స్పర్శలలో విరిసినాను నీకోసం
చలువరాతి శిలలపైన జాలువారు వెన్నెలగా
రేయంతా కలలబాట నడిచినాను నీకోసం
శశికాంతుల సెలయేరుల తేలిపోవు రాయంచగ
పాలపుంత అందాలనె పరచినాను నీకోసం
నీలికలువ పువ్వులలో నవ్వులుగా నీరూపమె
నవమినాటి జాబిలినై మెరిసినాను నీకోసం
తేనెపూల గిన్నెలతో తేటివిందు విజయములే
హరివిల్లునె పొదరిల్లుగ మలిచినాను నీకోసం