గజల్ విజయ గోలి
వెన్నెలంటి నీఅందం వేడుకేలే చూడగానె
ఎవరిచూపు సోకనీకు సోలేనే చూడగానె
నీలికొంగు పరదాలో దాచివుంచు సిరిమోమును
నాచూపుల నలుపేదో తగిలేనే చూడగానె
ఒంటరిగా తిరుగాడకు వన్నెలకే చూపుతగులు
పసిడిపూల పాలకంకె వడిలేనే చూడగానె
నడకలలో నాజూకుల నాగమల్లి నవ్వేనువ్వు
అడుగులలో అలకనంద అలిగేనే చూడగానె
చెక్కిలిపై ముంగురులే ముద్దులాడ మురిపములే
సందెగాలి ఆటలకే అలిసేనే చూడగానె
నీకునీవు చూడబోకు అద్దములో అందాలను
నీ చూపున బాకులేవొ తాకేనే చూడగానె
నీసొగసుకె దిష్టిచుక్క సరిచాలదు చందమామ
మెరుపుతీగ మబ్బులలో మలిగేనే చూడగానె