వాట్సాప్ లో చాటింగులు ,స్టేటస్ లో ఫీలింగులు
రిమోట్ యంత్రాల్లా మారి,మాట మరిచిన మనుషులతో ..
మనసు తీరా మాటలాడాలని వుంది
మరిచి పోయిన మధుర స్మృతులను మేలుకొలిపి
మరల మరల మాటాడాలని వుంది …
మూగ పోయిన గొంతుల్లో చైతన్యం నింపాలని వుంది..
ఆధునికత లో ఆదమరిచిన ..ఆత్మీయులతో ఆప్యాయంగా,తరచి తరచి
మాటలాడాలని వుంది.విజయ గోలి
కలిసి వచ్చిన బాటసారి
తన గమ్యం వచ్చిందంటూ సాగిపోతే ,
తోడు లేని పాదాలు తడబడుతున్నాయి
బాట పైనే చూపు నిలిపిన కళ్ళు
ఇంకెంత దూరము అంటూ
కలవరంగా అడుగుతున్నాయి
కలతబడిన మనసును …..Vijaya goli
అమ్మ
ముగ్గురమ్మల కలిపి మురిపంగా మలిచాడు అందమైన ఆడబొమ్మను ఆ బ్రహ్మ .
చేసిన ప్రతి బొమ్మ నుదుట వ్రాసాడు కమ్మనైన అమ్మతనాన్ని
అవని మీద అమృతాన్ని పంచమంటూ పంపాడు
అనుబంధాల పందిరికి అమ్మే కదా ఆధారం
తొలి గురువుగా జీవితాన శ్రీకారం అమ్మే కదా
తొలిసారిగా ప్రేమ రుచిని చవి చూపిన దేవతేగా
తప్పటడుగు సరి చేసే గొప్పతనం అమ్మదేగా
వెల లేని ప్రేమని కొలత లేక పంచటం అమ్మకేగా సాధ్యం
బ్రహ్మ బదులు అమ్మైతే ,అమ్మ బదులు పదమే లేదు
విశ్వమంతా నిండి వున్న మధురమైన పదమేగద అమ్మ.
సృష్టి అంటే అమ్మేగా,ప్రకృతంటే అమ్మేగా,అణువణువునా అమ్మేగా
అమ్మ లేని సృష్టి అసలు లేనే లేదుగా. ..విజయ గోలి