వలపు గడియ వేసిపెట్టి తలపు కిటికి తెరిచినాను
మనసు తాకగ పరిమళం మౌనరాగం పాడినాను
పగలు రేయి సాగి పోగా పాత పాట పాడుతుంది
క్రొత్త రాగం కోరుకుంటు పొద్దు నేనై వేచినాను
మోయలేని మనసు బరువు మూత పడని రెప్ప తీరు
ఎదురు చూపు వింత కధలు వినగ పూవై విరిసినాను
ఆశపెట్టు తేనెతుట్టె మలుపు మలుపు మాయ తెరలు
పాలపుంత పిలుపు వినక పరుగు లోనె అలసినాను
సమయ మెపుడు సర్దుకోదు కుదురు లేని మనిషి జోరు
విజయమంటె ఎండ వానకు గొడుగు నేనై నిలిచినాను