లక్ష్మీ ప్రశాంతి

విజయ గోలి గారు రచించిన కవితాసంపుటి
“నా కల-నా స్వర్గం ” మొత్తం అరవై తొమ్మిది కవితల సుమహారం.ఇందులో ప్రతి కవిత దేనికదే ప్రత్యేకం.సాధారణంగా మనం ఒక రచన చేసేటప్పుడు మనకు నచ్చిన రచయిత ప్రభావమో లేదా వారిని అనుసరించడమో మనకు తెలియకుండానే అప్పుడప్పుడు జరుగుతుంటుంది.
కానీ విజయ గోలి గారి కవిత్వం పై ఎవరి ప్రభావం ఉన్నట్టు కనిపించదు.ఆమెకంటూ ఒక శైలి ఉంది.

ప్రతి వ్యక్తికి తనకంటూ సొంత వ్యక్తిత్వపు ఆనవాలు అవసరమని చెప్పే కవిత “ఆవిర్భావం ”
అందులో ఆమె ఇలా వ్రాసారు.

“ఉదయించే సూర్యుడిగానో
ఉరిమే మేఘంగానో
ఉప్పొంగే సంద్రంగానో
ఓరిమి పొంగే ఊర్విగానో
నిప్పుగానో,నింగిగానో
ఏదైనా సరే అందులో నీవుండాలి.”

మన కుటుంబవ్యవస్థలో ప్రముఖపాత్ర పోషించేది మహిళలే అనేవిషయం మనమేవ్వరమూ కాదనలేని సత్యం.ఆ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఎన్నెన్ని అవమానాలను భరిస్తుందో ఎంతటి అంతర్గత సంఘర్షణకు లోనవుతుందో ,కుటుంబం కోసం తను ఎంతగా త్యాగం చేస్తుందో మనకు కళ్ళకు కట్టినట్టు చెప్పే కవిత “అదేమిటో..”

“మంచితనాన్ని చేతగాని తనమంటూ …
ఒప్పుకుంటూ …తప్పించుకుంటుంది
తెలియక కాదు ..బంధాలే బహుమతులై
అల్లుకున్న తీగలన్నీ అల్లాడి పోతాయని….

అదేమిటో …”

ఈ నాలుగు పాదాలు చాలవూ మహిళ జీవితం ఆధ్యాంతం ఎలా ఉంటుందో చెప్పడానికి.తనను అల్లుకున్న బంధాలకోసం ఎంతగా ఒదిగి ఉంటుందో తెలియజేయడానికి.

మౌనానికి ఒకో కవి ఒక్కో నిర్వచనాన్ని ఇస్తుంటారు.కానీ విజయ గోలి మాత్రం ఇలా అంటారు.

“మౌనం ఎప్పుడూ
మాటకందని భాషేమీ కాదు
రెండు మనసుల
నిండు ప్రేమల పాటే ఒకసారి ”

అలాగే ఇదే కవితలో మరోచోట ఇలా వ్రాసారు.

“బ్రతుకు రోసిన బాధల
మాట దాగిన బాటే ఒకసారి
మంటలు దాచిన మది
గొంతు దాటని గోడే ఒకసారి ”
అంటూ మౌనంలోని వివిధ కోణాలను ఆవిష్కరించారు.

అతివ బ్రతుకులోని ఒడిదుకుల్ని తెలియచేస్తూనే వాటిని ఆదిగమించి ఎలా ముందడుగు వెయ్యాలో చెప్పే కవిత “విజయ నీరాజనం ”

“అతివంటే యాగమంటూ
అతివంటే యోగమంటూ
గాలిలోన గడ్డివేసి
అందలం ఎక్కించేరు
అంతు తెలియని ఆగాదాలలో
ఆయువుతో ముంచేరు ”

స్త్రీ అంటే ఇలానే ఉండాలని హద్దులు గీసి,సహనమూర్తి త్యాగశీలి అని మొయ్యలేని బరువుల్ని ఆమెకు అంటగట్టిన వైనాన్ని తెలుపుతూనే,ఆమె తన శక్తిని తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగలనే చక్కని సందేశంతో కవిత ముగుస్తోంది.

ఈ కవితా సంపుటిలో ఎక్కువగా భావకవిత్వం ఉన్నప్పటికీ,అనేక సామాజిక అంశాలనూ కవిత్వంగా మలిచారు.కొన్ని దేశభక్తి కవితల్ని,దేశ నాయకులపై వ్రాసిన కవితల్ని ఈ సంపుటిలో పొందుపరిచారు.

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language