విజయ గోలి గజల్
మౌనంలో మాటలనే దాచుకుంది ఏమైనదొ
సఖులతోడ ఆటలనే ఆడకుంది ఏమైనదొ
కోయిలతో కుహుమంటూ పంతముతో పాడదుగా
చిలుకలతో పలుకులనే పంచకుంది ఏమైనదొ
తోటమలుపు తొంగిచూచు వీచుగాలి నదిలించును
పూలురాలు అలికిడికే విసుగుతుంది ఏమైనదొ
వెన్నెలలో వన్నెలలో చిన్నెలన్నీ మారిపోయె
జాలేదని జాబిలిపై అలుగుతుంది ఏమైనదొ
కబురంపని కన్నయ్యను తలచితలచి కసురుతుంది
మేఘాలను దూతలుగా పంపుతుంది ఏమైనదొ
రమణిమనసు తెలియలేని రాలుగాయి కాదుకదా
రాడేలని రచ్చచేసి రగులుతుంది ఏమైనదొ
మురళిరవళి గానమదిగొ విరహాన్నే తరుముతుంది
వేదననే *విజయంగా మలుపుకుంది ఏమైనదొ