గజల్. విజయ గోలి
మింటిమీద తొలిదీపం మబ్బుతెరల దాగుతుంది
కాచుకున్న కంటిచూపు కడలిపైనే ఆగుతుంది
అలలపైన నావ రూపు అందలేదు ..అలజడేగ
తెరచాపల రెపరెపలో గాలితీరు మారుతుంది
పొద్దుపొడుపు చుక్కతోడి బయలెళ్ళిన బతుకు వేట
సందెదాటి సగమైనా సడిచేయక సాగుతుంది
చిరుగాలులు జోరుపెరిగి హోరుగాలిగ తరుముతుంది
చినుకు చినుకు జడివానగ గుండెబరువు పెంచుతుంది
సరుకుతోటి సరంగొస్తె సంతోషమే మున్నాళ్ళకి
దినదినమూ గండంగా గుబులెంతో రేపుతుంది
తల్లిలాగ కాచుకున్నా …వొల్లదంటు తరిమేసిన
కాపాడే దిక్కంటే సాగరమే పలుకుతుంది
ఆటుపోటు ఆశలతో అల్పమైన ఆనందమే
విజయంగా తిరిగొస్తే సంబరమే జరుపుతుంది