*మాతృస్వామ్యం మళ్ళీ రావాలి
విజయ గోలి
ఆదిమానవుడిగా అరణ్యంలో
మృగాలలో మృగంగా మృగనీతితో
చీకటి గుహలలో ..గుండెకు బండకు
తేడాతెలియని అజ్ఞాన స్థితి నుండి
వెలుగు వెతుకుతూ బయటికి వచ్చాడు
అణువణువును చైతన్య పరుచుకుంటూ
వామనత్వం నుండి విశ్వరూపంగా విస్తరించాడు.
జన్మస్థానం తెలిసి మాతృమూర్తికి మనుగడిచ్చాడు
నవరసాల నాణ్యతతో బ్రతుకు నాట్యం నేర్చాడు
ఆదరించిన జన్మస్థానం నేడు వాడికి ఆటస్థానం
ఆటమత్తులో అహం పెరిగి అమ్మని ఆడబొమ్మను చేశాడు.
కామంతో మూసుకు పోయిన కంటి చూపులో …
అమ్మ ..ఆలి …చెల్లి . పండు ముసలో..నెత్తుటి పిండమో
గోవైనా..మేకైనా నక్కైనా కుక్కైనా ఆడదైతే చాలు..
అశక్తుల ఆక్రందనలతో అర్ధరాత్రి తెల్లవారుతుంది
స్పందనలేని సామ్రాజ్యానికి చేను వాడే..కంచె వాడే
ఎన్ని జన్మాలయాలని శిధిలాలయాలుగ చేసాడో..
న్యాయస్థానం గంతవిప్పి గుంత లోతు చూడాలి
మగసిరంటూ మిడిసిపడే వాడి అహాన్నే
ఖండ ఖండాలుగ నరికే..ఖడ్గంగ కాంతలే మారాలి
ఆదిశక్తి అంశలన్నీ ఉద్యమిస్తే అర్ధరాత్రి స్వాతంత్ర్యం
అడుగులలో *మాతృస్వామ్యం *మళ్ళీ రావాలి !