గజల్. విజయ గోలి
మాటదాటి కోటకడితె బాటదాగి పోదుకదా
నిప్పులాంటి నిజమెపుడు నీటదాగి పోదుకదా
కడలిఅలలు దాచలేవు సాగరాన అలజడులే
కనిపించే కదలికలో వేగమాగి పోదుకదా
కర్మఫలమే కాలుదువ్వి కదిలివచ్చు కనపడకే
వెంటపడును వెర్రిదంటె వేటలాగి పోదుకదా
నీడలలో నిజమెపుడూ ఒదిగుండును వామనుడై
మేఘాలే ఆవరిస్తే ఉదయమాగి పోదుకదా
బురదంటక పద్మమొకటి విరబూయును “విజయంగా
ఆత్మలోని పరమాత్మ ఆటలాగి పోదుకదా!