మరణానికి కరుణ లేదు..
కఠినమైన శాసనాలు చేస్తుంది.. విజయ గోలి
ఎన్నిజన్మల బంధమో ఇది ..
పంచ దశకాలను…పరమానందంగా గడిపాము …
ఆటుపోట్లను ఆడుతూపాడుతూ అడ్డుకున్నాము ..
జీవితంలో షడ్రుచులు అనుభవించేసాం …
ఇంకేముంది అనుభవించటానికి …. అనుకోలేదు
జీవితంలో అనుక్షణం క్రొత్తదనాన్నే ఆస్వాదించాం..
ఎపుడు రాని ఆలోచనలు …
మరణం….ఇపుడే గుర్తొచ్చింది ..
మరణానికి కరుణ లేదు
కఠినమైన శాసనాలు చేస్తుంది….
ఇది తప్పని మజిలీ ..తలొంచక తప్పదు ..నేస్తం ..
వియోగం తలుచుకుంటే …
మనసు…సూన్యమైపోతుంది..
మనుగడ ..మసకబారిపోయింది …
వన్నె తరిగిన నవ్వులతో …
ఒకరినొకరం మభ్యపెట్టుకుంటూ …ఏమి లేనట్లు ..
అనుభవాలు మనసు అద్దంలో ప్రతిబింబిస్తుంటే ..
ఎంతబాగా నటిస్తున్నాము …
నీవు లేని లోకం లో నేనెన్నాళ్లు ఉండగలను …
నీ అడుగులో …నా అడుగేస్తూ …
నీ వెనుకే వచ్చేస్తా …ఎదురు చూస్తావుగా …
ఏమిటి ..అంటున్నావు …
మబ్బుల్లో చల్లగా ఉంటుందేమో ….
వచ్చేప్పుడు నువ్వు..అల్లిన..
నీలిరంగు ..షాల్..తెచ్చుకోమంటున్నావా …
అలాగే..అలాగే …అక్కడికి ..లగేజ్ నాట్ అలోవెడ్…
నా…మాటలకు…నవ్వుతున్నావా …
చివరి ఘడియ వరకు నాచెయ్యి విడవకుండా …
ఇలాగే ..నీ..నవ్వుల చెలిమి పంచుతూనే వుండు ..నా జీవన నేస్తమా…