నవ మల్లెతీగ కధల సంచికలో ప్రచురితం
*మన ఇల్లు. విజయ గోలి
“అమ్మా బ్యాగ్ సర్దుకున్నావా…తలుపు తీసుకు వస్తూనే ఎదురుగా సోఫా మీద కూర్చున్న తల్లిని అడిగింది పద్మ ..అంతలోనే తల్లి పక్కన వున్న బ్యాగ్ చూసి
“రెడీగా ఉన్నావుగా..వదినేది అడిగింది ..హడావిడిగా
పద్మ గొంతు వింటూనే గదిలో నుండి బయటకు వచ్చింది లావణ్య
“అన్నీ సర్దుకోవటం అయిందా వదినా …అడిగింది పద్మ
“ కొంత సర్దాను పద్మా ..ఇంకా మీ అన్నయ్య బ్యాగ్ సర్దాలి .ఆయన వచ్చి సర్దుకుంటారులే.
“అత్తా నా ఐప్యాడ్ తెచ్చుకుంటానంటే అమ్మ వద్దంటుంది ..అంటూ గదిలో నుండి బయటకు వచ్చాడు పదేళ్ల విక్రమ్
“ రెండు రోజుల కొరకు అవన్నీ ఎందుకురా..వాటిని జాగ్రత్త చేయలేక చావాలి .
అమ్మ చెప్పినట్లు విను .అంతగా ఆడుకోవాలంటే మా ఫోన్లు వున్నాయిగా..మేనల్లుడినిబుజ్జగిస్తూ చెప్పింది పద్మ.
“ సరే వదినా బయట ఆటో నిలబెట్టి వచ్చాను .అమ్మను తీసుకు వెళ్తాను .ఇంకా నేను సర్దుకోవాలి .రేపు స్టేషన్ దగ్గరకి వచ్చేస్తామని అన్నయ్యకు చెప్పు .రాత్రికి ఫోన్ చేస్తాను .”
“పదమ్మా…పద్మ తల్లి బ్యాగ్ తీసుకుని వాకిలి వైపు నడుస్తూ..
“లావణ్యా వెళ్లొస్తానమ్మా…శివాకి చెప్పమ్మా …విక్కీ జాగర్త నాన్నా..లలితమ్మ పద్మ వెనకాల అడుగు లేస్తూ
“సరే అత్తయ్యా…మీ అబ్బాయి వచ్చి తీసుకొస్తారులే ..మీ ఆరోగ్యం జాగ్రత్త …లావణ్య
“బాయ్ నానమ్మా..విక్రమ్ .
“మందులు పెట్టుకున్నావు కదా ..బయటకు వచ్చి ఆటో ఎక్కి కూర్చున్నాక తల్లిని అడిగింది పద్మ
సర్దుకున్నానన్నట్లుగా తలఊపింది లలితమ్మ.
ఇంతలో పద్మ ఫోన్ మోగింది..భర్త ఆనంద్ ..”వచ్చేస్తున్నాము అంటూ సమాధానం చెప్పింది
ఆటో లో వెళ్తున్నంతసేపు ఇంటికి వెళ్ళి చేయవలసిన పనులన్నీ ఏకరువు పెడుతూనే వుంది
పద్మ.మౌనంగా వింటుంది లలితమ్మ .
పద్మ ఇంటి దగ్గర ఆటో దిగగానే …
“అమ్మమ్మా అంటూ ఎదురొచ్చి వాటేసుకుంది ఎనిమిది సంవత్సరాల శ్రీజ .
“బాగున్నావా తల్లీ ..శ్రీజ ను దగ్గరకు తీసుకొని ముద్దుపెట్టుకుంటూ అడిగింది లలితమ్మ .
“ బాగున్నారా అత్తయ్యా అంటూ లోపలనుండి వచ్చి పద్మ చేతిలో బ్యాగ్ అందుకుంటూ అడిగాడు పద్మ భర్త ఆనంద్ .
బాగున్నానంటూ తలవూపుతూ …మీరెలా ఉన్నారు అంటూ వారివెనుకే లోపలకి వచ్చింది లలితమ్మ .
“అన్నం పెట్టేసాను పద్మా …చపాతీలు కూరలు తీసుకొచ్చాను .నువ్వు స్నానం చేసిరా
భోజనం చేసి బ్యాగులు సర్దుకుందాం ఆనంద్ .
“ అలాగే ..అమ్మా ..ఐదు నిమిషాల్లో వస్తాను అంటూ గదిలోకి వెళ్ళింది పద్మ .
ఆనంద్ ఫోనులో వున్నాడు .శ్రీజ ఫోనులో ఆడుకుంటుంది .
లలితమ్మ లేచి వంటింట్లో కి వచ్చింది .కాసిని మంచినీళ్ళు తాగి ,డైనింగ్ టేబుల్ పై ప్లేట్లు పెట్టింది అన్నం కూరలు అన్నీ సర్ది పెట్టింది .
పద్మ స్నానం చేసి వచ్చింది.అందరూ భోజనం చేసారు …
“అమ్మా..శ్రీజ గదిలో నువ్వు పడుకో.అది మాదగ్గర పడుకుంటుందిలే .నీదగ్గర పడుకుంటే నీకు నిదుర వుండదు . నువ్వు ఉదయం 8గంటలకి రెడీ అవ్వాలి .అంటూ శ్రీజ ను తీసుకుని తమ గదిలోకి వెళ్ళింది పద్మ .
టైమ్ రాత్రి తొమ్మిదిన్నర అయింది .
పెద్ద లైటార్పి చిన్న లైట్ వేసి బెడ్ మీద పడుకుంది లలితమ్మ .
మనసులో ఏదో తెలియని అలజడి .మూతలు పడని కళ్ళముందు గతం నీడలు తెరలు తీసాయి .
విజయవాడకు దగ్గరలో తిరువూరు ఒక చిన్న ఊరు .ఆ ఊళ్ళో పోస్టాఫీసులో పోస్టు మాస్టర్ గా పనిచేస్తున్నాడు నీలకంఠం. నిజానికి అతని సొంత ఊరు కూడా అదే.
తాతల ఆస్తిగా వున్న మిద్దె ఇల్లు ,అతని బంధు బలగం అంతా ఆఊళ్లోనే వున్నారు .
సౌమ్యుడని మంచి పేరు .సర్వీసు అసాంతం దాదాపుగా ఆఊళ్ళోనే చేసి రిటైర్ అయ్యాడు.అతని భార్య లలితమ్మ.చక్కటి మనిషి ,భర్తకు తగ్గ ఇల్లాలుగా అందరిలో పేరు తెచ్చుకుంది .ఇద్దరు పిల్లలు శివశంకర్ ,పద్మజ. ఇద్దరినీ చదివించి పెళ్లిళ్లు చేసారు .మంచి ఉద్యోగాలతో ఇద్దరూ హైదరాబాద్ లో స్థిరపడ్డారు.వారిద్దరికీ ఇద్దరు పిల్లలు.
ముందు నుండి లలితమ్మ చాలా అమాయకురాలు .ఇల్లు భర్త, పిల్లలు ,వారి అవసరాలు చూడటం .అంతకు మించిన ప్రపంచం ఆమెకు తెలియదు .
భర్తకు పిల్లలకు ఇష్టమైన వంటలు చేసి దగ్గరుండి వడ్డించి తినిపించటం చాలా ఇష్టమైన విషయం .ఎవరికైనా వండి వడ్డించటం , వాళ్ళు ఇష్టంగా తింటుంటే ఆమెకు చాలా సంతోషం .
లలితమ్మ చాలా బాగా వంటలు చేస్తుంది .తిన్న ఎవరూ కూడా వంక పెట్ట లేరు .అందులో
పప్పుచారు ,గుమ్మడి కాయ దప్పళం ఆమె ప్రత్యేకతలు .అవి ఆమెకు కూడా చాలా ఇష్టమైన వంటలు . అందుకే వాటిని వాళ్ళ బామ్మ దగ్గరనుండి ప్రత్యేకంగా నేర్చుకుంది .
దప్పళం పెట్టినా,పప్పుచారు పెట్టినా సగం చుట్టు పక్కల వారికి పంపకం చేయాల్సిందే …
పండుగకు పబ్బానికి పిల్లలు వస్తే ఆమెకు వంట గదిలోనే సరిపోయేది ..
కొడుకు కూతురే కాదు అల్లుడు కోడలు కూడా ఆమె వంటలంటే చాలా ఇష్ట పడేవారు .
మళ్ళీ వెళ్లేటపుడు ఎవరికిష్టమైన పిండి వంటలు వారికి చేసి డబ్బాలకు సర్ది పంపేది .
నీలకంఠం రిటైర్ అయిన తర్వాత కూడా వారిద్దరూ చాలా సంతోషంగా గడిపేవారు .
పిల్లలే ఎక్కువగా వచ్చి వెళ్లేవారు. పిల్లలు హైదరాబాద్ లో స్థిర పడ్డాక
రమ్మని ఎన్ని సార్లు పిలిచినా వెళ్ళలేదు .
మనవడు , మనవరాలు పుట్టినపుడు మాత్రమే వెళ్లి రెండు నెలలు కూడా వుండి వచ్చారు .
అన్నీ సవ్యంగా జరిగితే అనుకోవలసి పనిలేదు కదా …
రెండు సంవత్సరాల క్రితం నీలకంఠం ఆకస్మికంగా గుండెపోటుతో మరణించాడు.లలితమ్మ ఒంటరైపోయింది . బంధువులంతా అండగా నిలబడ్డారు .
పిల్లలు తమతో రమ్మన్నారు . కొద్ది రోజులు ఇక్కడే వుంటానంది లలితమ్మ .కానీ ఎక్కువ రోజులు ఒక్కతే ఉండలేకపోయింది . కొడుకు శివ వచ్చి హైదరాబాద్ తీసుకెళ్లాడు .
అప్పటివరకు ఒకలా వున్న జీవితం మరోలా మారి పోయింది .మార్పుకు అలవాటు పడటం కష్టమైంది .ఏదో ఊపిరాడని పరిస్థితి.
ఏ పని లేదు .వంట చేద్దామని వెళ్లినా కోడలు .వద్దు అత్తయ్యా .నేను చేస్తాను .మీరు రెస్ట్
తీసుకోండి .టీ వి చూడండి అనేది .కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది .ఉదయాన్నే వంట చేసి భర్తకు , కొడుకుకు తనకు బాక్సులు పెట్టేసి .మిగిలిన అన్నం కూరలు .టేబిల్ మీద పెడుతుంది . కాఫీ పెట్టి ప్లాస్క్ లో పోసి పెడుతుంది .ఉదయం టిఫిన్ ఇడ్లీ నొ,ఉప్మానో , లేకుంటే రెండు బ్రెడ్ ముక్కలు కాల్చి అక్కడ పెడుతుంది .అవి లలితమ్మ కొరకు . ఇవన్నీ చాలా వింతగా , కొత్తగా అనిపిస్తున్నాయి .
లావణ్య వుండగానే పనిమనిషి వచ్చి పని పూర్తి చేసి వెళ్తుంది . ఎప్పుడైనా పనిమనిషి రాక పోతే ఆ పని చేయటం తన వంతైంది . అది తనే తీసుకుంది .ఆ రోజు చాలా సంతోషంగా అనిపించేది పని చేసినందుకు .
సాయంకాలం ఆఫీసునుండి వచ్చి వాషింగ్ మిషను వేస్తుంది . అప్పుడు రాత్రికి చపాతీలు చేస్తుంది . లేకుంటే ఒక్కోసారి వస్తూనే చపాతీలు కూర కొనుక్కొస్తుంది .
అక్కడకి లలితమ్మ వంట నేను చేస్తానమ్మా…అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నావు
నాకు ఏమి తోచటం లేదు . కనీసం సాయంత్రం చపాతీలు చేస్తాను అని ..అయినా లావణ్య ఒప్పుకోలేదు .
పరవా లేదు ఇన్నాళ్ళు మీరు చేసారు ..ఇప్పుడు రెస్ట్ తీసుకోండి . అంటూ తేలిగ్గా తీసేసేది
ఆఫీసునుండి వచ్చేటప్పుడు కొడుకును స్కూలు నుండి తీసుకొస్తుంది .దారిలో వాడికి కావలసినవి కొనిపించి తీసుకొస్తుంది .
శివకు అసలు తినటానికి కూడా సమయం లేనంతగా వాడి ఉద్యోగం .ఉదయం 9గంటలకు ఇంటినుండి వెళితే రాత్రి తొమ్మిది కో పదికో వస్తాడు . చల్లగా అయిన ఆ చపాతీలు తిని రెండు నిమిషాలు తల్లిని పలుకరించి గదిలోకి వెళ్లి పోతాడు .వీళ్ళ దినచర్యలు చూస్తుంటే …లలితమ్మకు చాలా అసహనంగా వుండేది .అయినా చూస్తు ఊరుకోవటం తప్ప ఏమి చేయలేని పరిస్థితి.
ఇంట్లో జంతికలు లాటివి చేస్తా అన్నా …వద్దంటూ అవి కూడా షాపుల్లో కొని తెచ్చేది.
ఆదివారాలు అందరూ నిద్ర లేవడమే 11 అవుతుంది .
పోనీలే …అని ఒకటి రెండు సార్లు తనే కల్పించుకుని వంటలు చేసినా …
ఆదివారాలు వంటలు వద్దులే అత్తయ్య …విక్కీ బయటకు తీసుకెళ్లమని గొడవ చేస్తాడు .
లేదంటే ఏదో ఆర్డర్ చేసుకుందాము . అంత హెవీ గా నూనెలు అవి తగ్గించు కుంటే మంచిది అనేది.
లలితమ్మకు అర్థమైంది అదివరకులా వంటలు చేయటం కుదరదని . వారి జీవనశైలి మారిందని .
తనకు కూడా నోరు చచ్చి పోయింది .ఏమి తింటుందో కూడా తెలియ కుండా ఆకలి తీర్చుకుంటుంది .
నెలకొక సారి పద్మ ఆఫీసు నుండి వెళ్తూ వచ్చి వాళ్ళింటికి తీసుకెళ్తుంది .
అక్కడ కూడా ఇదే తంతు . శ్రీజ తినదంటూ ప్రతి రోజూ ఏదో ఒక ఆర్డర్ ..కాక పోతే అల్లుడు
ఆనంద్ కు మాత్రం సాయంకాలం అన్నం కూర వుండాల్సిందే .
అక్కడ చేద్దామని వెళ్లినా నువ్వు వద్దులే అమ్మా…నూనె తక్కువ వేయాలి …ఆయనకు నచ్చదు. నేనే చేస్తాను అనేది .
ఆశ్చర్యపోయింది లలితమ్మ…అత్తయ్యా మీ వంటలు పద్మకు నేర్పండి .
అత్తయ్యా అది చెయ్యండి ఇది మీరు బాగా చేస్తారు అనిఅడిగి చేయించుకునే అల్లుడికి
నువ్వు చేస్తే నచ్చవు అనే కూతురి మాట నవ్వు తెప్పించింది .
వాళ్ళ అంతరంగాలు అర్ధమైన నాటినుండి మౌనంగా వుంటుంది .
ఒక విషయం లో చాలా ఆనందంగా వుండేది ..అందరిలా కాకుండా అన్నా చెల్లెళ్ళ మధ్య
వదినా మరదళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం వుంది . ఈ విషయంలో ఆమెకు చాలా మనశ్శాంతి.
ఒక విషయం లో మనసులో ఎప్పుడూ మధన పడుతుంది . తనే పోయి తన భర్త బ్రతికుంటే …ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా వుండేది .ఆయన అసలే భోజ ప్రియుడు . ఆ విషయంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది .
అలాంటి మగ వారు ఎలా వుంటారు …నాలాంటి వారు చాలా మందే వుండి వుంటారు .తను ఎక్కువగా ఆలోచిస్తుంది .
సొరకాయ,ముక్కలు మునక్కాయ వేసిన పప్పు చారు తిని ఎన్నాళ్ళైందో .
ఒక రెండు మూడు సార్లు ఏమైనా చేసిందేమో లావణ్య .అందులో ఏమి వుండవు …
అసలు విషయానికి వస్తే …
అన్నా చెల్లెళ్ల కుటుంబాలు ఇంకా కొందరు స్నేహితులు కలసి వారం రోజులు కేరళ ట్రిప్ వెళ్తున్నారు . ముందు తీసుకెళ్దామని ఆలోచించారు కానీ చాలా దూరాలు నడవ వలసినది వుంటుందని వద్దనుకున్నారు .
ఒక్కదాన్ని ఇంట్లో వుంచటం కూడా సబబు కాదనిపించింది . ఆలోచిస్తున్నపుడు
పద్మ స్నేహితురాలు చెప్పింది .పద్మ వాళ్ళింటికి దగ్గరలోనే ఒక ఒల్డేజ్ హోమ్ వుందని .
అందులో టెంపరరీ గా కూడా వుండవచ్చనీ. డబ్బు తీసుకుని అన్ని వసతులు కల్పిస్తారు .
మనం వచ్చేవరకు జాగ్రత్తగా చూసుకుంటారని చెప్పింది .
మర్నాడు పద్మ వెళ్ళి మాట్లాడి వారం రోజుల కొరకు డబ్బు కట్టి వచ్చింది . రేపు ఉదయం అక్కడికి వెళ్ళటానికి రెడీగా వుండమని చెప్పింది .
ఉదయమే ఎనిమిది గంటలకు లలితమ్మను తీసుకుని హోమ్ దగ్గరకు వచ్చింది పద్మ .
లలితమ్మను మేనేజర్ దగ్గరకు తీసుకెళ్లింది .
“మీరు మీ ఇంట్లో వున్నట్లే వుండొచ్చమ్మా…ఇక్కడ అందరూ ఒక కుటుంబం లా కలిసి వుంటారు . మీకు ఎలాంటి ఇబ్బంది వున్నా మాకు చెప్పండి. అంటూ లలితమ్మ భుజం మీద చేయి వేసి ఆదరంగా మాట్లాడారు.
“మీ అమ్మ గురించి మీరు దిగులు పడక్కరలేదు .ఈ వారం రోజులు జాగ్రత్తగా చూసుకనే బాధ్యత మాది.మీరు నిశ్చింతగా వెళ్ళిరండి ..అంటూ పద్మకు భరోసా ఇచ్చింది మేనేజర్.
అక్కడున్న వాళ్లని పిలిచి లలితమ్మ ను లోపలకు తీసుకెళ్లమని చెప్పారు .
“జాగ్రత్తమ్మా…మేము రోజు ఫోన్ చేస్తాము .ఒక్క వారం రోజులేగా వచ్చేస్తాము .అంటూ తల్లి చేయి పట్టుకుని బుజ్జగిస్తున్నట్లుగా చెప్తుంది పద్మ .
“ అలాగే అన్నట్లుగా తల ఊపింది.లలితమ్మ
“ నేను బయలుదేరతాను అంటూ వెను తిరిగిన పద్మ వంక దిగులు గా చూసింది లలితమ్మ .
“రండమ్మా లోపలికి వెళ్దాం అంటూ బ్యాగ్ తీసుకుని ఇద్దరు తీసుకెళ్ళారు .
పెద్ద వరండా దాటి లోపలి కెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద హాలు వుంది .ఆ హాలులో
పదిహేను పడకలు వరకు వున్నాయి .కొద్ది దూరంగా పది బాత్రూములు
అలాంటివి మూడు హాల్స్ వున్నాయి .లలితమ్మకు ఎనిమిదవ నంబరు బెడ్ ఇచ్చారు .ప్రతి బెడ్ పక్కన ఒక టేబుల్ ఛైర్ , బట్టలు ఏవైనా వస్తువులు పెట్టుకోవటానికి ఒక కప్ బోర్డ్ ఇచ్చారు .మంచాల మధ్య దూరం విశాలంగా వుంది .అక్కడ వున్న అందరూ దాదాపుగా తన వయసులోనే వున్నారు . మంచి గాలి వెలుతురు వస్తుంది . బయట బాగా చెట్లు వున్నట్లున్నాయి చాలా చల్లగా అనిపిస్తుంది .
లలితమ్మకు ఇదొక కొత్త ప్రపంచంలా వుంది . ఇలాంటి ప్రపంచం ఒకటుందని నిజానికి లలితమ్మకు అసలు తెలియదు . అనాధాశ్రమం ఆవిడకున్న అభిప్రాయాలు వేరు .
విస్మయంగా చూస్తుంది .
“టిఫిన్ చేద్దాం రండి లలితమ్మతో వచ్చిన వాళ్ళలో ఒకావిడ పిలిచింది .
పరిచయం లేకున్నా అందరూ స్నేహ పూర్వకంగా చిరునవ్వుతో పలుకరిస్తున్నారు .
“నా పేరు సుమన మీ పేరు ఏంటి అడిగింది ఆవిడ డైనింగ్ వైపు నడుస్తూ .
“నాపేరు లలిత ..చెప్పింది లలితమ్మ.
అందరూ చాలా స్నేహంగా వుంటారు కాసేపటిలో అందరూ పరిచయమవుతారు రండి
ముందు నడుస్తూ చెప్పింది సుమన .
మెల్లిగా బెరుకుగా సుమన వెనకాలే డైనింగ్ హాల్ లోకి వెళ్ళింది .
చాలా పెద్ద హాల్ ఒక్క సారిగా వంద మంది కూర్చుని భోజనం చేయవచ్చు .
రాతి అరుగులు రాతి బల్లలు అరేంజ్ చేసి వున్నాయి .అప్పటికే అక్కడ చాలా మంది టిఫిన్లు చేస్తూ వున్నారు .కొందరు వడ్డిస్తూ వున్నారు .
“ కొత్తగా వచ్చారా…పలుకరిస్తున్నారు
తల ఊపుతు సమాధానం చెప్తుంది లలితమ్మ.
సుమన తన కంటె ఒక నాలుగేళ్ళు చిన్నగా వుంటుందేమో…మనిషి రంగు తక్కువైనా
చక్కగా వుంది .
ఇద్దరూ వెళ్లి ఒక బల్ల మీద కూర్చున్నారు . ఇంతలో ఒకావిడ రెండు విస్తరాకులు తెచ్చి
వాళ్ళ ముందు పెట్టి
“ఈవిడ కొత్తగా వచ్చారా సుమనక్కా..పలుకరించింది .
“అవును .ఒక వారం కొరకు ..నేను రానా అరుణా వడ్డనకు ..అడిగింది సుమన .
లేదు నేను వడ్డిస్తాను నువ్వు కూర్చో..నేను టిఫిన్ చేసాను లే ..అరుణ
వేడి వేడి ఇడ్లీ సాంబారు , కట్టె పొంగలి తెచ్చి వడ్డించింది .ఇంకొకరు వచ్చి మంచినీళ్ళు పెట్టి వెళ్లారు .అడుగుతున్న అందరికీ సుమన సమాధానం చెప్తుంది .
అందరూ చక్కగా అక్క, పెద్దమ్మ, అత్తమ్మ పిన్ని అంటూ వరుసలతో పిలుచుకుంటుంటే
లలితమ్మకు తమ ఊరు గుర్తు వచ్చింది .కొద్దిగా దిగులనిపించింది .
విస్తరాకులో ఇడ్లీ ,సాంబారు ,కొబ్బరి చట్నీ ,పొంగలి చూడగానే లలితమ్మ ప్రాణం లేచివచ్చింది . ఎన్ని రోజుల ఆకలో …ఇవాళ తెలిసినట్లు అనిపించింది .
“మొహమాట పడకుండా తినండి చెప్పింది సుమన .
తన ఆరాటం కనపడకుండా మెల్లిగా తినటం మొదలుపెట్టింది లలిత .
ఆ తర్వాత ఎవరో కాఫీ తెచ్చి ఇచ్చారు . ఫిల్టర్ కాఫీ వాసన చూస్తేనే తెలిసి పోతుంది
ఎంతో ఇష్టంగా తాగింది .
విస్తరాకులు ఎవరివి వాళ్ళు తీసుకెళ్ళి దూరంగా వున్న బుట్టలో పడేసారు .
“ వంట గది చూస్తారా రండి ..వంట గదిలోకి తీసుకు వెళ్లింది సుమన .
వంట గది చూసి ఆశ్చర్య పోయింది .చాలా పెద్దగా వుంది ..చాలా మంది వున్నారు కొందరు కూరగాయాలు తరుగుతుంటే , కొందురు వంట దగ్గర వున్నారు .కొందరు వాళ్ళకు కావలసినవి అందిస్తున్నారు . అందరూ చక్కగా కలిసి పోయి కబుర్లు చెప్పుకుంటున్నారు .
లలితమ్మకు సంతోషమనిపించింది . అందరూ సుమనతో నవ్వుతూ మాట్లాడుతున్నారు
సుమన కూడా వారితో క్షేమ సమాచారాలడుగుతూ నవ్వుతూ మాట్లాడుతుంది .
“రండి హోమ్ చూపిస్తా అంటూ వంట గది వెనుకకకు తీసుకెళ్ళింది సుమన .
వెనుక చాలా ఖాళీ స్థలం వుంది .అందులో కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు వేసారు కొంత మంది మొక్కల పని చేస్తున్నారు . వాళ్ళు కూడా సుమన ని చూసి చేతులూపారు . వంట గదిని ఆనుకుని పెద్ద చప్టా వుంది అక్కడ నలుగురు గిన్నెలు కడుగుతున్నారు . మంచినీళ్లకు సపరేట్ గా వున్నాయి .
వెనుక వైపునుండి ముందు గార్డెన్ లోకి తీసుకువెళ్ళింది .ముందు వైపంతా రకరకాల పూలమొక్కలు .వాటి మధ్యలో అక్కడక్కడ కూర్చోవటానికి సిమెంటు బెంచీలు వేసివున్నాయి ..ఆ మధ్యలో ఒక మండపం లాంటి ది వుంది . అక్కడ భగవద్గీత చెప్తున్న కృష్ణుడు అర్జునుడి బొమ్మ వుంది . హోమ్ చుట్టు సన్నని బాట వుంది నడవటం కోసం .అక్కడక్కడ బెంచీల పై కూర్చుని చదువుకుంటున్నారు .
మెల్లిగా బెరుకు తగ్గింది లలితమ్మకు
ఎంత మంది వుంటారు ఇక్కడ అడిగింది .
మొత్తం డెబ్భై మంది వరకు వుంటారు . వంట వాళ్ళు ముగ్గురు , పనివాళ్ళు ఆరుగురు వుంటారు .వాళ్లు సాయంకాలం ఇంటికి వెళ్లి వస్తుంటారు . మేనేజర్ గారి రూమ్ పక్కనే
డాక్టరు గారి రూమ్ 24 గంటలు ఇద్దరు డాక్టర్లు వుంటారు .చెప్పింది సుమన .
“ఈ హోమ్ ఎవరు చూస్తారు లలిత
రాజు గారని పెద్ద వ్యాపార వేత్త వాళ్ళ అమ్మ గారి పేరు మీద పెట్టారు . ఆవిడ పేరు రాజ్య లక్ష్మి.రిజిస్ట్రేషన్ లో మాత్రమే వుంటుంది కానీ హోమ్ పేరు “మన ఇల్లు”
వారానికి ఒకసారి వచ్చి వెళ్తుంటారు .
ఇక్కడ ఎవరికి నచ్చిన పని వారు చేస్తుంటారు .అందరూ అరవై సంవత్సరాల పైన బడిన వారే.కాక పోతే నెలకి కనీసం 5వేలనుండి ఇవ్వగలిగిన వారు ఇచ్చినంత తీసుకుంటారు .
కొంత మందికి ఏమి లేకుండా కూడా వుంటారు వారి పరిస్థితిని బట్టి .
హోమ్ కు కావలసిన బియ్యం కూరగాయలు పాలు అన్నీ వాళ్ళ ఫామ్స్ నుండి వస్తుంటాయి .
ఎవరు ఎవరినీ పని చేయాలని వత్తిడి చేయరు . పని అందరు కలసి పంచు కుంటారు .
మధ్యాహ్నం సమయం వృధా కాకుండా అల్లికలు కుట్లు ఇంట్రస్టు వున్న వారు చేస్తుంటారు . కాగితపు సంచులు తయారు చేయటం లాంటివి చేసి షాపులకు పంపుతారు . నేను ఇక్కడకు వచ్చి మూడు సంవత్సరాలైంది .ఈ సంస్థ పెట్టి ఐదు సంవత్సరాలైంది . ఇక్కడ ఒక్కొక్కళ్లది ఒక్కొక కధ .
అవన్నీ మరిచిపోయి ఒక కుటుంబంలా వుంటాము . ఆరోగ్యం సరి లేని వారికి అందరూ సహాయం చేస్తారు . పండుగలకు ముఖ్యమైన రోజుల్లో రాజు గారి కుటుంబం కూడా ఇక్కడకు వచ్చి మా అందరితో కలసి భోజనం చేసి వెళ్తారు .ఇక్కడ అందరూ ఆడవారే వుంటారు . అంతేకాదు .హిందువులు మాత్రమే వుంటారు ఇలా చెప్పుకు పోతూనే వుంది
సుమన .
“అలా ఎందుకు అడిగింది లలితమ్మ
“అన్ని మతాలు ఒకటే కాని ..మత పరమైన విద్వేషాలు వస్తాయేమో..అరవై సంవత్సరాలు పైన వారంటే కొన్ని నిర్దిష్టమైన సాంప్ర దాయవు పధ్ధతులలో వుంటారు .వారిని మనం మార్చ లేము .వాళ్ళ అమ్మగారికి హిందూమతం అంటే ఇష్టం అందుకని వారి నిర్ణయం అది చెప్పింది సుమన .
“ఎవరిఇష్టమైన పనులంటే …వంట చేయవచ్చా…అడిగింది లలితమ్మ
“ఏ పనైనా చేయవచ్చు బదులిచ్చింది సుమన .
“అయితే నేను వంట చేస్తాను ..లలితమ్మ.
“ ఆశ్చర్యంగా చూసింది సుమన
“. నాకు వంట చేయడం చాలా ఇష్టం లలితమ్మ
అలాగే చేద్దురు రేపు ఎనిమిది గంటలకు వంట గదికి వెళ్దాం .
“ సరే మీరు వచ్చి చాలా సేపయింది కదా లోపలికి వెళ్లి కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి
పన్నెండు గంటలకు లంచ్ మొదలవుతుంది .అంటూ లలితమ్మను తన బెడ్ దగ్గర వదిలి వెళ్లింది సుమన .
తన బ్యాగు కప్బోర్డ్ లో పెట్టి .బాత్రూంకి వెళ్ళవచ్చి మంచం మీద కూర్చుంది .
హాల్లో చాలా మంది పడుకుని వున్నారు కొంత మంది కూర్చుని ఏవో పిచ్చా పాటీ మాట్లాడు కుంటున్నారు. వారంతా బాగా పెద్ద వారు లా వున్నారు .
ఒకళ్లిద్దరు వచ్చి పలుకరించి వెళ్లారు .
లలితమ్మ కు అంతా కలలోలావుంది .వీళ్లందరు ఇక్కడ ఎందుకు వున్నారో ..ఎవరూ లేని వాళ్లా ..రకరకాల ఆలోచనలు మనసు నిండా తిరుగుతున్నాయి .
కొంత సేపటికి భోజనాలకి పిలిచారు . అందరూ అరుగుల మీద కూర్చున్నారు .అరిటాకులు వేసి వడ్డించారు అన్నం ,ఆకు కూర పప్పు , దొండకాయ పచ్చడి , క్యాబేజి కూర , మజ్జిగ చారు . చల్ల మిరపకాయలు .పెరుగు అరటి పండు . చిన్న స్వీటు .
ఎన్ని రోజులైంది ఇలా భోజనం చేసి . కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి .తిండి గురించి ఇలా అయిపోయానేమిటి ..తను ఆలోచించేది తిండి ఒక్కటే కాదు .పొద్దుటినుండి సాయంత్రం వరకు జైల్లో వున్నట్లుగా వుంది . వాళ్ళ గురించి వాళ్లు ఆలోచించటానికే సమయం లేదు
ఇంక నాగురించి ఏమాలోచిస్తారు . ఆరోగ్యంగా చేసి పెడదామన్నా అవకాశం ఇవ్వటంలేదు . నూనెలు తగ్గించి వాళ్లకిష్టమైన విధంగా చేసి పెడతాను కదా..బయట కొనుక్కొచ్చిన తిండి ఎంత వరకు ఆరోగ్యం . తెలుసుకోవటం లేదు .
“ హాయిగా ఇలా అన్నం తిని ఎన్ని రోజులైందో ..చాలా తృప్తిగా అనిపించింది లలితమ్మకు .
వడ్డించిన వారు కూర్చున్నారు భోజనాలకి .తను కూడా వడ్డిస్తానని అడిగింది .
పరవాలేదు చాలా మందిమి వున్నాము .మీరు కూర్చోండి అంటూ వారించారు .
అందరి భోజనాలు అయిన తర్వాత కొంత మంది వంటగది సర్దుతున్నారు .మిగిలిన వారు ఎవరికి తోచిన పని వారు చేస్తున్నారు . వరండా లో ఎడమవైపు టీ వి రూమ్ వుంది .అక్కడ కొంత మంది కూర్చున్నారు .
లలితమ్మ ముందు గార్డెన్ లోకి వెళ్లి కూర్చుంది. ఆమె ఆలోచనలు పలు రకాలుగా పోతున్నాయి . .
.” ఎలా వుంది మా హోమ్ భోజనం …అంటూ పక్కన వచ్చి కూర్చుంది సుమన .
“ చాలా బాగుంది ఇంత మంది ఒకే చోట తమకున్న కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా వున్నారు .ఉద్వేగంగా చెప్పింది లలితమ్మ .
అలా చాలా సేపు అక్కడే కూర్చున్నారు . అక్కడున్న కొందరి గురించి చెప్తుంది సుమన .
సాయంకాలం నాలుగు గంటలకు టీ రెండు బిస్కెట్లు కూర్చున్న చోటికే తెచ్చి ఇచ్చారు .
సాయంత్రం ఏడు గంటలకు డిన్నర్ ..చాలా తేలికగా అన్నము రసము , కూర, మజ్జిగ ఇచ్చారు .అన్నం వద్దనే వారికి చపాతీ కూర ఇస్తున్నారు .
భోజనాలయ్యాక టీవీ దగ్గర కూర్చున్నారు చాలామంది . లలితమ్మ కూడా అక్కడే కూర్చుంది . తొమ్మిది న్నరకు టీవీ ఆపేసారు . అందరూ హాల్లో మంచాల పైకి చేరారు .
పది గంటలకు లైట్లు ఆపేసారు .
చాలా రోజుల తర్వాత ఇష్టంగా తిన్నదేమో .. చాలా నిద్రవస్తుంది .
అలా పక్క మీద పడుకోవటంతోనే నిద్ర పోయింది .చాలా రోజుల తర్వాత మంచి నిద్ర పట్టింది అనుకుంది తెల్లవారి ఐదు గంటలకు లేచి .
మనసు చాలా ప్రశాంతంగా వుంది .
అప్పటికే చాలా మంది లేచారు . లైటు వేయకుండా పక్కవారికి ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా వారి పనులు చేసుకుంటున్నారు .
లలితమ్మ కూడా ఆరుగంటలు అయ్యేసరికి స్నానం చేసి రెడీ అయి పోయింది . వరండాలో వున్న దేవుడి మందిరం దగ్గరకు వెళ్లి నమస్కారం చేసుకుని మెల్లిగా వంట గది వైపు వెళ్ళింది .
అక్కడ వంటవాళ్లు టిఫిన్లు మొదలు పెట్టారు .ఒకవైపు కాఫీకి పాలు , డికాషన్ రెడీ చేసుకుంటున్నారు . అప్పటికే సుమన అక్కడుంది .
లలితమ్మను చూస్తూనే…నవ్వుతూ వచ్చేసారా..రాత్రి బాగా నిద్ర పట్టిందా…కాఫీ ఇస్తా వుండండి అంటూ వేడి వేడి కాఫీ తెచ్చి పెట్టింది.
కాఫీ తాగుతుంటే చాలా హాయిగా అనిపించింది.
“ వీరయ్య బాబాయ్ ఈ రోజు వంటకు లలితమ్మగారు కూడా వస్తారు …చూడండి .వంట మాస్టర్ కు చెప్పి లలితమ్మను పరిచయం చేసింది .
“ అలాగేనమ్మా…టిఫిన్లు అయినాక మీరు ఇక్కడ కొచ్చేయండి . అన్నాడు లలితమ్మవంక చూస్తూ ..
టిఫిన్ చేయటం అవగానే వంట గదిలోకి వెళ్ళింది లలితమ్మ.ఇంకా కొంతమంది వచ్చారు .
“ రండమ్మా…ఈరోజు మనం చేయబోయే కూరలు చూద్దాం లలితమ్మను పిలిచాడు వీరయ్య .
“ ములక్కాయలు ,సొరకాయలు , వంకాయలు .దోసకాయలు , చిక్కుడు కాయలు టమాటాలు ,పచ్చి మామిడి కాయలు వచ్చినయ్ అమ్మా… ఏమి చేద్దాం
ములక్కాయలు మామిడి కాయలు మనఇంట్లోవి సంబరంగా చెప్పాడు వీరయ్య .
సాంబారు పెట్టి , దోసకాయ మామిడి కాయ ముక్కలపచ్చడి చేద్దాం
వంకాయలు టమాటా గుజ్జు కూర, చిక్కుడు వేపుడు చేద్దాం నెమ్మదిగా చెప్పింది లలితమ్మ .
అక్కడ వున్న వాళ్ందరూ మెనూ బాగుందంటూ పని మొదలు పెట్టారు
వీరయ్య , లలితమ్మ పొయ్యి దగ్గర సాయంతో చాలా తొందరగా కూడా వంట చేసేసారు .
దాదాపుగా అన్నీ లలితమ్మే చేసింది .ఆరోజు వడ్డన కూడా చేసింది లలితమ్మ.
ఆరోజు అందరూ వంటలు బాగా మెచ్చుకున్నారు .సాంబారు చాలా బాగుందని తిన్న తర్వాత అందరూ వచ్చి చెప్తుంటే లలితమ్మకు వెనుకటి రోజులు గుర్తు వచ్చాయి . కళ్ళ వెంట నీరు తిరిగాయి .
“ అమ్మా మీరింత రుచిగా చేస్తే ఇంక నా వంటలు ఎవరూ తినరమ్మా …నవ్వుతూ వీరయ్య కూడా మెచ్చుకున్నాడు . నిజానికి వీరయ్య కూడా మంచి వంట మనిషి .
“ భయపడకులే బాబాయ్ …లలితమ్మ ఈ నాలుగు రోజులే …వుండేది .సుమన
అందరికీ చిరునవ్వే సమాధానం అన్నట్లు నవ్వుతుంది లలితమ్మ .
ఈ నాలుగు రోజుల్లో అందరితో కలిసిపోయింది. తను ఎక్కువ మాట్లాడక పోయిన
మాట్లాడుతుంటే వినటం ,నవ్వటం చేస్తుంది .రోజు మొత్తంలోఏదో ఒక సమయంలో వంట గదిలో తన ప్రావీణ్యం చూపుతుంది .
ఐదు రోజులు చాలా బాగా గడిచాయి .రేపు వెళ్ళి పోవాలి .ఉదయం ఎనిమిది గంటలకు పద్మ వస్తుంది తనని తీసుకెళ్లటానికి .తెలియని ఏదో బాధ మనసులో. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టలేదు.చాలా అలజడిగా వుంది .
ఉదయం ఆరు గంటలకు రెడీ అయిపోయింది.ఎప్పటిలానే వంట గదిలోకి వెళ్లింది .
“ఈ రోజు మీరు వెళ్తున్నారటగా…సుమనమ్మ చెప్పింది .అమ్మ తోటపని దగ్గర వుందనుకుంటా …వస్తారులే…మంచి కాఫీ ఇస్తాను అంటూ కాఫీ తెచ్చి ఇచ్చి అప్పుడప్పుడు వస్తూ వుండండి .మనసుకు బాగుంటది అన్నాడు వీరయ్య .
“కాఫీ తీసుకుంటూ చిరునవ్వుతో అలాగే అన్నట్లుగా తల ఊపింది లలితమ్మ.
అందరూ పలుకరిస్తున్నారు …అప్పుడప్పుడు రండి అని చెప్తున్నారు .
అన్యమనస్కంగానే టిఫిన్ చేసి ఆఫీసు దగ్గరకు వెళ్ళింది.
“ రెడీ అయ్యారా …మేనేజర్ నవ్వుతూ పలుకరించింది .
“తల ఊపుతూ … నవ్వుతూ కూర్చుంది లలితమ్మ.
సుమన వచ్చింది ..రాత్రి నిద్ర పోలేదా …అలసటగా కనిపిస్తున్నారు అడిగింది సుమన ..
మీ అందరూ బాగా అలవాటై పోయారు …వెళ్ళాలంటే కొంచెం బాధగావుంది .లలితమ్మ.
“ అవును మాకు అలాగే వుంది . అప్పడప్పుడు వస్తూ వుండండి ..చెప్పింది సుమన
“ వెళ్దామా అంటూ ఇంతలో పద్మ వచ్చేసింది .మేనేజర్ గారిని కలిసి వస్తా అంటూ మేనేజర్ రూములోకి వెళ్లింది .కాసేపటిలో బయటకు వచ్చి తల్లితో వెళ్దామా ..అంది .
“తల ఊపుతూ ఇపుడే వస్తాను అంటూ లోపలికెళ్లి ..అందరికీ చెప్పి వచ్చింది లలితమ్మ.
కొద్ది రోజుల్లోనే బాగా అలవాటయ్యారు .అప్పుడప్పుడు రండి లలితమ్మ చెయ్యి పట్టుకుని మరీ చెప్పింది సుమన .
పద్మతో కలసి వెళ్లి ఆటోలో కూర్చుంది .
“ట్రిప్ బాగా జరిగిందా అడిగింది లలితమ్మ.
“చాలా బాగా జరిగిందమ్మా ..పిల్లలు బాగా ఎన్జాయ్ చేసారు .
నీకెలా వుంది …ఇబ్బంది గా ఏమి లేదుగా…అడిగింది పద్మ .
“అలాంటి దేమి లేదు .అందరూ మంచి వాళ్లు. లలితమ్మ
“సాయంకాలం అన్నయ్య ,వదిన ,విక్కీ మనింటికే వస్తామన్నారు .
వచ్చి భోజనం చేసి నిన్ను తీసుకుని వెళ్తామన్నారు .పద్మ
విని మౌనంగా వుంది లలితమ్మ.
ఆ సాయంత్రం శివ వాళ్లు వచ్చారు ..అందరూ కలిసి భోజనాలు చేసారు .భోజనంచేస్తున్నంతసేపు ట్రిప్ విశేషాలు మాట్లాడుతూ వున్నారు .
ఆ తర్వాత అందరూ ముందు హాల్ లో కూర్చున్నారు. శ్రీజ , విక్కి రూమ్ లో ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు .
“ అమ్మా వెళ్దామా అడిగాడు శివ.
“ నేను మీతో కొంచెం మాట్లాడాలి శివా ..సందిగ్ధంగా అంది లలితమ్మ.
అందరూ ఆశ్చర్యంగా లలితమ్మ వంక చూసారు …
“ఏమిటమ్మా… హోమ్ లో ఏమైనా ఇబ్బంది కలిగిందా…ఆరోగ్యం బాగానే వుంది కదా…
ఆశ్చర్యం నుండి సర్దుకుని అడిగాడు శివ .
“అలాంటి దేమి లేదు .నా ఆరోగ్యం చాలా బాగుంది .మరేం లేదు …నేను హోమ్ లో వుండి
పోదామనుకుంటున్నాను . మెల్లిగా చెప్పింది లలితమ్మ .
సరిగా విన్నామా అన్నట్లుగా ఆమె వంక చూసారు అందరు .
“ అవును..నేను హోమ్ లో వుండి పోదామనుకుంటున్నా …ఈ సారి గట్టిగా చెప్పింది .
నేను చెప్పేది సాంతం వినండి
“మీ వలన నాకు ఎలాంటి ఇబ్బంది లేదు .మీ లాంటి బిడ్డలు అందరికీ దొరకరు .అది నాఅదృష్టం .
ఎందుకో..ఆ హోమ్ కు వెళ్లిన దగ్గరనుండి నేను పోగొట్టుకున్నదేదో నాకు దొరికిందనిపించింది . కొన్నాళ్లు నేను అక్కడ వుంటాను .ఏమాత్రం బాధగా వున్నా మీ దగ్గరకే వస్తాను .నాకు మాత్రం ఎవరున్నారు .నన్ను అర్ధం చేసుకోండి . మీ మీద నాకెలాంటి కోపం లేదు . మీరందరూ పనులకు వెళ్లి పోతే చాలా ఒంటరిగా అనిపిస్తుంది .
చెప్తూనే వుంది లలితమ్మ .
“ ఏంటమ్మా ఇది మేముండగా నువ్వు హోమ్ కు వెళ్లటం ఏమిటి ..తప్పక వారం రోజులు పంపాము అంతే కాని …అలా కుదరదు గట్టిగా అంది పద్మ ..
“అవునమ్మా అందరూ ఏమనుకుంటారు …వారం రోజులు నిన్ను అక్కడ వుంచడానికి ఎంత బాధనిపించిందో తెలుసా..సౌమ్యంగా చెప్పాడు శివ .
లావణ్య ,ఆనంద్ మౌనంగా వారి సంభాషణ వింటున్నారు .
“ ఎవరో అనుకుంటారనే మాట అనకు శివా..మన మధ్య అర్ధం చేసుకునే అనుబంధం వున్నపుడు .ఎవరి గురించో మన మెందుకు ఆలోచించాలి . ..నాకు అక్కడ బాగుంది సంతోషంగా వుంది .ఇక్కడ లేదని కాదు వేరుగా ఆలోచించకండి . నా. గురించి ఆలోచించండి .కొద్ది రోజులు వుండి చూస్తాను . లలితమ్మ
ఆమె స్వరంలో గట్టి నిర్ణయం కనిపించింది లావణ్యకు ..ఆమె వేదన అర్థమైంది .
ఎంతో సేపు వాదన జరిగిన తరువాత.. అన్నా చెల్లెళ్ళు కొంత మెత్త బడ్డారు .
లావణ్య , ఆనంద్ కూడా దగ్గరే కదా.. కొద్ది రోజులు చూద్దామన్నట్లుగా లలితమ్మను సపోర్ట్ చేసారు .
లలితమ్మకు చాలా ఆనందమేసింది .పిల్లలు అసలు ఒప్పుకోరు అనుకుంది.
కానీ ఒప్పుకున్నారు .లావణ్య అర్ధం చేసుకోగలదు , ఆనంద్ కూడా వాస్తవం ఆలోచిస్తాడు .
శివ ,పద్మ …తల్లిని కదా ..ఆ వైపుగా వారి ఆలోచన ..ఏమైతేనేం అందరూ ఒప్పుకున్నారు .
సరే..అయితే ఈ రాత్రికి ఇక్కడే వుండి రేపు అమ్మను హోమ్ దగ్గర దింపి వెళ్దురు గాని చెప్పింది పద్మ .
ఆ రాత్రికి అందరూ అక్కడే పడుకున్నారు . విక్కీ,శ్రీజ లలితమ్మ దగ్గర పడుకున్నారు .
లలితమ్మకు చాలా సంతోషంగా వుంది .ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ పడుకుంది .
ఉదయమే పద్మ హోమ్ మేనేజరుకు ఫోన్ చేసి లలితమ్మ నిర్ణయం గురించి చెప్పింది .
ఆమె ఆనందంగా తీసుకు రమ్మని చెప్పింది .
ఉదయం పదకొండు గంటలకు అందరూ ..హోమ్ దగ్గరకు వెళ్లారు .
విషయం తెలిసిందేమో సుమన,అరుణ ఇంకా కొంత మంది ఎదురొచ్చారు .
మేనేజర్ ముందుకొచ్చి నవ్వుతూ స్వాగతం పలికింది .
లలితమ్మగారు నాలుగు రోజులకే అందరికీ ఇష్టులు పోయారు .నిన్న వెళ్తుంటే చాలా బాధ గా అనిపించింది .అందరి వంక చూస్తూ చెప్తుంది మేనేజర్.
“మీ అమ్మగారి గురించి మీరు దిగులు పడవలసిన పనిలేదు .మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు . మీ అమ్మగారిని తీసుకు వెళ్లవచ్చు .ఇక్కడ వున్న వాళ్ళందరూ ఎవరి బలవంతం మీద వచ్చిన వారు కాదు. వాళ్ళ ఇష్ట ప్రకారం వుంటున్న వారే . వివరించినట్లుగా చెప్పింది మేనేజర్.
భోజనాలు రెడీ గా వున్నాయి అందరూ భోజనాలకి రండి పిలిచింది సుమన.
అందరినీ భోంచేసి వెళ్లమని వత్తిడి చేసారు అందరూ..
అందరూ డైనింగ్ హాల్లోకి వచ్చారు . బల్లలపై అరిటాకుల్లో వడ్డించి పదార్థాలు చూడగానే…
అత్తగారు ఏమి మిస్ అవుతున్నారో అర్థమైంది లావణ్యకు .
“ క్షమించండి అత్తయ్యా మిమ్మల్ని అర్ధం చేసుకో లేక పోయాను .ఆవిడ దగ్గరగా వచ్చి భుజం మీద తల వాల్చి చెప్పింది లావణ్య
“ పిచ్చి దానా ఇందులో క్షమాపణ ఏమి లేదు …నన్ను అర్ధం చేసుకున్నావు . నాకు తెలుసు
మీ కిష్టమైనట్లుగా తినండి కానీ ఆరోగ్యంగా తినండి . పిల్లల తిండి అలవాట్లు మార్చండి .
మీ కష్టానికి ఫలితం అనారోగ్యం కాకూడదు . సరే పద భోజనం చేద్దువు గాని అంటూ చేయి పట్టి లావణ్యను తీసుకెళ్ళింది లలితమ్మ .
చాలా రోజుల తర్వాత ఇలాంటి భోజనం చాలా ఇష్టంగా తిన్నారు అందరూ ..
భోజనాలయ్యాక లలితమ్మను వదిలి బయలుదేరుతున్నారు ..అందరూ మేనేజర్ గారికి
థాంక్స్ చెప్పారు .
నేను ప్రతివారం ఇక్కడికే భోజనానికి వస్తాను అత్తయ్యా…నవ్వుతూ చెప్పాడు ఆనంద్ .
అవునవును అందరం వద్దాము అన్నాడు శివ..
దానికేమి భాగ్యం తప్పకరండి అంది సుమన .
బయటకు వెళ్లి తినేదేదొ ఇక్కడే తిని ఆ డబ్బులేవో *మనఇంట్లో ఇవ్వండి ..నవ్వుతూ అన్నది లలితమ్మ .
“ అవును ఈ అయిడియా బాగుంది .పద్మ , లావణ్య ముక్త కంఠంతో అన్నారు ..
వీళ్ల మాటలు వింటూ నిలబడిన మేనేజర్
నిజమే ఇదేదో చాలా బాగుంది . ఈ విషయమై రాజు గారితో మాట్లాడాలి .మెరుపు లాంటి ఆలోచన వచ్చింది .అలా అనుకున్న ఒక్క క్షణం ఆమె మస్తిష్కంలో “మన ఇల్లు” అనే పెద్ద బోర్డ్ నియాన్ లైట్లలో కనిపించింది .
మా సెలవులకు ఇక్కడికే వస్తాం అంటూ విక్కీ , శ్రీజ లలితమ్మకు బై చెప్పారు.
వెళ్తూ వెనుతిరిగిన శివ కళ్ళల్లో సన్నని నీటి పొర కనిపించింది లలితమ్మకు .