మనిషితనం

*మనిషితనం*      విజయ గోలి 

అపుడెపుడో చాలా కాలం క్రితం తప్పిపోయింది

మనిషిలో  మృగం జేరినప్పటి నుండి ..వెతుకుతూనే వున్నాను ..

గమ్యం లేని బాటసారిలా . ..చేజారిన ఉనికిని ..

మసకబారిన కనుపాపలో చిన్న మెరుపు చుక్క ..

గాలిలో దీపానికి అరచేతులు అడ్డం పెట్టినట్లు ..

ఆశ ఆరిపోకుండా ఆజ్యం పోస్తుంటే .. .

ఇప్పటివరకు వెతుకుతూనే వున్నాను .

అపుడెపుడో నేను నడిచిన దారిలో

మనిషిగా  బ్రతికున్నపుడు

అమ్మతనానికి వేసిన సింహాసనం

సాలభంజికల సోపానాలతో నింగిని తాకేది .

అవని అందమంతా .సుగంధ పరిమళాలతో..

జుంటి తేనెల తీపిని విశ్వమంతా పంచి పెట్టేది ..

ఇపుడాబాట మారిపోయింది

మృగాల మృత్యుకేళికి ఆలవాలమైంది

ఎదిగిన హర్మ్యాల క్రింద

ఆసనమెపుడో తునాతునకలయ్యింది

రాక్షసత్వపు రగడతో ఆడతనం మత్తుగొలిపే మధువైంది .

శిశువో ,పశువో ,అమ్మో ,బామ్మో  ఆడతనముంటే చాలు ..

అవసరానికి అంగట్లో బొమ్మైంది..

అమ్మతనానికి అంగరక్షగ నిలిచిన ..

మానవత్వం దిక్కుతోచక పిచ్చికేకలు వేస్తూ తప్పిపోయింది ..

మిణుకు  మిణుకుమంటున్న ఆశతో

మనిషి చేజార్చుకున్న  ఉనికిని వెతుకుతూనే వున్నా ……..విజయ గోలి

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language