మనిషితనం

మనిషితనం* విజయ గోలి
మనిషి తనమనే. ..ఒక దివ్యత్వం
అంధకారపు ఆవిరిలో
దారి తప్పి పోయింది …
అపుడెపుడో చాలా కాలం క్రితం…
మనిషిలో మృగం జేరిన నాడు
తనకు తానుగ వెళ్ళిపోయింది

గమ్యం లేని బాటసారిలా . ..
మసకబారిన కనుపాపలో
చిన్న మెరుపు చుక్క …
ఆశ ఆరిపోకుండా ఆసరా అవుతుంటే..
చేజారిన ఉనికిని చేరదీయాలని..
మనిషి మనిషిలో వెతుకుతూనే ఉన్నాను..

నేను నడిచిన ఈ దారిలో…
మనిషిగా బ్రతికున్నపుడు …
అమ్మతనానికి వేసిన సింహాసనం …
సాలభంజికల సోపానాలతో నింగిని తాకేది .
అవని అందమంతా .సుగంధ పరిమళాలతో..
జుంటి తేనెల తీపిని విశ్వమంతా పంచి పెట్టేది ..
ఇపుడా …బాట మారిపోయింది …
మృగాల మృత్యుకేళికి ఆలవాలమైంది …

ఎదిగిన హర్మ్యాల క్రింద
ఆసనమెపుడో తునాతునకలయ్యింది
రాక్షసత్వపు రగడతో ఆడతనం మత్తుగొలిపే మధువైంది .
శిశువో ,పశువో ,అమ్మో ,బామ్మో
ఆడతనం…అంగట్లో బొమ్మైంది..

అమ్మతనానికి అంగరక్షగ …
నిలిచిన ..మానవత్వం దిక్కుతోచక
పిచ్చికేకలు వేస్తూ తప్పిపోయింది ..
మిణుకు మిణుకుమంటున్న ఆశతో …
మనిషి చేజార్చుకున్న ఉనికిని వెతుకుతూనే వున్నా
భద్రంగా భవితకు అందచేద్దామని….

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language