గజల్. విజయ గోలి
నీవురాక క్షణమైనా కదలకుంది మనసుబాట
నినుచూడక వలపుపాట పాడకుంది మనసుబాట
ఎర్రకలువ విచ్చుకుంది ఎదురుచూచు కన్నులలో
వెన్నెలలో వెచ్చదనం ఒదగకుంది మనసుబాట
కాలమాగె నీవులేక …పరుగులెట్టె నీరాకతొ
కధలతీరు క్షణంక్షణం మారుతుంది మనసుబాట
ఘడియలలో గమకాలే ప్రేమలలో గమ్మత్తులు
నిలిచిపోగ ఈరేయిని కోరుతుంది మనసుబాట
సన్నిధిలో సమయమెపుడు సంబరాల సంగీతమె
ఎడబాటుల నిషాదమే పాడుతుంది మనసుబాట
మదిలోపల మరుని శరం గుచ్చుతుంది నీతలపున
నీకొరకే మయూరమై ఆడుతుంది మనసుబాట
నీలికురుల నిలిపేసెద జాబిల్లినె *విజయ ముగా
విరపూసిన ప్రణయాలతొ నవ్వుతుంది మనసుబాట