* గజల్. విజయ గోలి
కనురెప్పల కుంచెలతో వర్ణలేఖ రాస్తున్నా
ప్రణయాలే పల్లవిస్తూ ప్రేమలేఖ రాస్తున్నా
మధుపాలే మబ్బులుగా ముసిరినవే మధువుకోరి
స్వగతాలే సమ్మతంగ హంసలేఖ రాస్తున్నా
చిగురించే అల్లికలో జారిపోవు తీగలేల
వమ్ముకాని నమ్మకాల హస్తరేఖ రాస్తున్నా
కలతలేక కాలమంత కలలాగే సాగాలని
అధరాలపై హసితంగ చంద్రలేఖ రాస్తున్నా
సమ్మోహిత రాగాలలో విజయాన్నే కాంక్షిస్తూ
సురలోకపు బంధాలతో శుభలేఖ రాస్తున్నా