ప్రేమలేఖ విజయ గోలి
ప్రియాతి ప్రియమైన నా ప్రాణమా !
దూరాలు చాలా భారంగా తరుగుతున్నాయి ….
అందరికి కాలం చాలా వేగంగా కదులుతుంది ..
నాకు మాత్రం కాలమే కదలటం లేదు ..
ఎడబాటు …ప్రతిపనిలో తడబాటు చూపుతుంది ..
నా తడబాటు చూసి నలుగురు నవ్వేస్తున్నారు ..
నేను వ్రాసే వూసుల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తావు …
వస్తున్నావుగా …అందుకే కబుర్లేమి వ్రాయటం లేదు
దాచివుంచిన వూసులన్నీ ..కొంగున ముడివేసి వుంచాను
నువ్వు వచ్చేవరకు ..నా హృదయం …
మేఘమల్హరి ఆలపిస్తూనే ఉంటుంది ..
చినుకువై .. స్పృశిస్తావో ..చిరుజల్లుల చిలకరింతలిస్తావో …
వానవై .. చుట్టేస్తావో ..వరదవై ..ముంచేస్తావో ……
నీ పలకరింతల …పులకరింతలలో ..
తరించాలని ..తపిస్తూ ……నీ ప్రాణం !