ప్రశ్నల బ్రతుకు …విజయ గోలి .
తల్లి వేరుకు నిప్పు పెడితే చికిత్స ఎలా ?
సాటి మనిషిగా సమతుల్యత లేకుంటే ఎలా ?
ఆడపిల్లల ప్రాణమంటే దూది కంటే తేలికైతే ఎలా ?
అడుగడుగున కామాంధుల రగడైతే ఆడపిల్ల బ్రతికేది ఎలా ?
చూపులన్నీ మదమెక్కిన ఆకలి తూపులైతే ఎలా ?
బాటలన్నీ కర్కశ ముళ్ల తోటలైతే ఎలా ?
గాలులన్నీ వేసవి వడగాల్పులైతే ఎలా ?
నిశీధులన్నీ నిప్పుల కుంపట్లయితే ఎలా ?
కనుల దాగిన కలలన్నీ కాలరాస్తే ఎలా ?
కన్న కడుపులు కోత కోస్తే…ఎలా ?
గుండె లోపల గునపాలు గుచ్చుతుంటే ఎలా ?
బ్రతుకంతా ప్రశ్నలైతే ..బడబాగ్నుల మధ్యన బ్రతికేది ఎలా ?
ఆడపిల్లలంటేనే అమ్మ ..అనే సంస్కృతి పెంచేది ఎలా ?
మూలాలకే శస్త్ర చికిత్స ముఖ్యమేమో ..మరి ..
జన్యుకణాలను జాగృతం చెయ్యాలేమో ..లేకుంటే …
భావిలోన ఆడపిల్ల కనుమరుగై ..చరిత్ర లోన చేరునేమో…