శీర్షిక *గీత నాది రాత మీది*
*పైశాచిక నృత్యం*
దారి తప్పిన మానవత్వం..
నిలువెల్లా నింపుకుంది.. దానవత్వం .
కరుడు కట్టిన కాఠిన్యం
కరి మీదకు మళ్ళింది
నోరు లేని జీవంపై..
పైశాచిక నృత్యం చేసింది
అమ్మతనం ఆకలితో
ఆహారం అర్ధిస్తే..
దయలేక..దగాచేసి…
నిప్పులనే తినిపించి..
నిలువునా చంపారు..
తాళలేని ఆ తల్లి ..
నీట మునిగి..ఆర్తిగా..
ఎంత ఆక్రోశించిందో..
కడుపు మంటకు ఓర్చలేక
ఎంత ఏడ్చిందో…
హరీ అని ఒక పిలుపుతో..
వైకుంఠమే వదిలి..
వడివడిగా వచ్చి
మకరిని దునిమి..
కరి రాజుని కాచితివే..
ఈ కరి మొర నీకు
వినపడ లేదా..హరీ..
రాక్షస క్రీడ కనపడలేదా..
ధర్మానికి హాని కలిగి నపుడు
వస్తానని చెప్పావే..
నువ్వు వున్నావా లేవా ..
సందిగ్ధంలో సతమతమవుతున్నాము
నువ్వు వున్నావని నిరూపించు..
పాప ఖర్మలకు ఫలితం చూపించు..
ఈదేశంలో ..నిన్ను నమ్మిన జనం
నీ రాక కోసం ఎదరు చూస్తున్నారు…
నువ్వు వున్నావని నిరూపించు..విజయ గోలి 7 /06 /2020