గజల్. విజయ గోలి
కనులనుండి నారూపం చెరపగలవ ప్రియతమా
మనసునుండి నాప్రేమను మలపగలవ ప్రియతమా
మధురమైన జ్ఞాపకాలు మనసువదిలి పోలేవు
కాదంటూ కన్నీటిని దాచగలవ ప్రియతమా
పచ్చబొట్టు ప్రమాణం పచ్చనిదే పరిమళం
వెచ్చదనం వదిలివేసి వెళ్ళగలవ ప్రియతమా
దూరమెంత నడిచిననూ దారులన్నీ నావేలె
లేదంటూ నీఅలసట ఆపగలవ ప్రియతమా
ఊపిరినై నీఉసురులొ వెలుగుతున్న దీపమునె
మరలివచ్చు మాటొక్కటి చెప్పగలవ ప్రియతమా