గజల్ విజయ గోలి
ఎదురుచూపు చూచువేళ ఎదుటపడవు న్యాయమా
మనసు తెలుపు వేళలలో మాటాడవు న్యాయమా
ఇరు సంధ్యల అందాలలొ సిందూరపు వన్నెలతొ
నానుదుటన శింగారమై తారాడవు న్యాయమా
నడిరేయిన రాలిపడే తళుకుచుక్క తలపులలొ
నీ జతనే వరమడిగిన మారాడవు న్యాయమా
కదిలిపోవు కడలివోలె మదిలోతులు దాచినా
పొలమారే దిగులు చూసి ఏమారవు న్యాయమా
ఏరులైన కన్నీటిలో కలువనైతి నినుకోరి
కంటికొసన కరుణతోడ నను కానవు న్యాయమా
శిలగానే మారి నావొ శిల్పి నీవు కాలేవొ
పలుమారులు వేడినను పలుకాడవు న్యాయమా
అలకలేల మురళీధర ఆశతోడ జేరేను
అలుసైతిని అందగాడ ఆటాడవు న్యాయమా