శుభోదయం🌹🌹🌹🌹🌹🌹
విజయ గోలి. గజల్
ఎపుడో చాలా రోజుల క్రితం చదివిన ఒక హిందీ కధ ..రచయిత ఎవరో కూడ గుర్తు లేదు…కధ పేరు *షమ్మా…..వయసు వచ్చినప్పటినుండి…మెహఫిల్ లో నాట్యం చేస్తూ…గానంచేస్తూ జీవించిన స్త్రీ ..ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆమె …వయసు ప్రాబల్యంలో ఓపిక వుడిగి…పోయాక…అందరూ…ఆవిడను పక్కకు పెట్టినపుడు ఆమె మనోవ్యధ పైన స్పందనతో వ్రాసిన గజల్ …
“షమ్మా “అంటే దీపం
నేలతడిపిన చినుకులెపుడో ఆరిపోయే కళ్ళముందే
గుండెనవ్విన గురుతులక్కడె ఆగిపోయే కళ్ళముందే
మోడువారిన చెట్టుపైనా చిగురులెక్కడ పలుకరించును
చిన్నపోయిన చిలుకలన్నియు చెదిరిపోయే కళ్ళముందే
మలిగిపోయిన మమతలింకా మళ్ళిరావులే మార్గమందున
ఎదురుచూపులు వెన్నుతట్టుతు వెళ్ళిపోయే కళ్ళముందే
కనికరించని కలతలన్నియు కావ్యమాయె కాలమందున
కనులనిలిచిన కలల రూపం నిలిచిపోయే కళ్ళముందే
కొడిగట్టినది రంగుల షమ్మా వెంటరాని వెలుగునొదిలీ
కంటి కొసలన నీటిచుక్కగ కరిగిపోయే కళ్ళముందే