విజయ గోలి గజల్
సంబరంగ స్వాగతమే పలకాలని ఉన్నదిలే
ఆశగానె నీచెలిమే చెయ్యాలని ఉన్నదిలే 🌹🌹
నూతన సంవత్సరమా మనసుతీర ఆహ్వానం
విశ్వమంత హరివిల్లుగ విరియాలని ఉన్నదిలే🌹🌹
గరళమంటి గతమింకా గుండెదాటి పోలేదులె
తొణికిపోక అమృతమే కోరాలని ఉన్నదిలే🌹🌹
స్తంభించిన జగమంతా సందడులే జరపాలని
స్వార్ధాలను అధిగమించి సాగాలని ఉన్నదిలే🌹🌹
కనువిప్పని స్వప్నాలతొ కాలమంత గడిచిపోయె
కటికచేదు సమయమేదొ కరగాలని ఉన్నదిలే🌹🌹
అలసిపోయి అడుగులేవొ తడబాటుల బాటలాయె
తరిగిపోని వెలుగులనే నింపాలని ఉన్నదిలే🌹🌹
ఆశలకే రెక్కలొచ్చి *విజయాలతొ ఎగరాలని
ఆనందమె అర్ణవమై ఆడాలని ఉన్నదిలే🌹🌹