.నుదుటి వ్రాత. విజయ గోలి
బ్రహ్మ వ్రాసిన వ్రాత..
ఎన్ని యుగాల వేధింపులు
ఊడలు పెరిగిన వటవృక్షాలై
ఎదుట నిలిచె వంకర గీతలు గా
కంటిన గీసిన కాటుక రేఖలు
కాలసర్పాలై బుసలు కొట్టినా
కారుణ్యం నీ అసలు నైజం
కర్కోటకుల కదే ఆయుధం.
అన్ని వేళలా అమ్మ వైతే
కన్నీటి వరదను దాటలేవు
అప్పుడప్పుడు అపర కాళిక
నీవని మనసు తీర తలచుకో
యుగ యుగాలుగ నువు
మట్టు పెట్టిన మదాంధుల
లెక్క సరిగ చూపించు
నీ శ్వాశ లేక బ్రతుకు లేని జన్మ
అయినా నువ్వంటే అలుసు
అణచి వేత బాటలోనె
నడుస్తుంది సృష్టి ఇరుసు
ధర్మా ధర్మా లేమిటో …
తెలియ లేని దైన్యం ..ఎన్నాళ్ళో…
ఒకే ప్రశ్నగా ఎదుట నిలచిన
విధాత వ్రాసిన నీ నుదుటి వ్రాత.