నీమా. విజయ గోలి
పుష్యమాసం ఉషోదయం సూర్యుడు మెల్లగా
మంచు పరదాలను తొలగించి తొంగి చూస్తున్నాడు..
సన్నని వెలుగు రేకలు మెల్లమెల్లిగ మేలుకుంటున్నాయి
కాఫీతో కప్పుతో కారిడార్లో కూర్చున్న నాకు …కాంపౌండు ప్రక్కనే
కళ్లముందే మొక్క దగ్గర నుండి మ్రానుగా మారిన వేపచెట్టును
చూసినపుడు ఏదో ఒక బంధం ..పచ్చగా పలకరిస్తుంది..అలా తదేకంగా
చూసినపుడు …ఆత్మీయంగా అనుభూతి…నేను దానికి పెట్టిన పేరు నీమా
మైదానమంతా పరుచుకున్న వేపచెట్టు ….
అన్ని ఋతువుల అందాలు ఆకళింపు చేసుకుంది …
పచ్చదనానికి అలవాటైన కళ్ళు …పండుటాకు రాలుతుంటే …
క్షణకాలం బాధ కలిగినా..వెనువెంటనే వచ్చే చిగురులు …
చిగురులతో…వికసించే పువ్వులు …మనసుకు కొంత సాంత్వనం..
మత్తుగొలిపే పూలవాసన….వీడకముందే …
చిరుపిందెలు ….కాయలు….పండ్లు…ఆ సమయంలో చెట్టు నిండా చేరే పిట్టలు
అవసరానికి చుట్టు చేరే అవకాశ వాదుల్లా అనిపిస్తాయి..
రాలు తున్న పండ్ల తీపివాసన …జారకముందే …
మళ్ళీ. ..చక్రభ్రమణం …జీవన తరంగాలను ..స్పృశిస్తూ ..
ఎంత నేర్చిన పాఠమిదేనంటూ..పునరపి జననం ..పునరపి మరణం..