నిరీక్షణ విజయ గోలి
కలలలోన కలతగా తొలిఝాము కరిగింది.
మలి ఝాము మొదలాయే మరులతో నీ పైన
ఎదురు చూపుల నా కనుల నాగమల్లెలె పూచేను
పొగడపువ్వులు జల్లులై పొదరిల్లు నింపేను
అలలపై వినిపించు నీ మురళి పిలుపు కై
ఎదురు చూసే ఎడద అలసి పోయెను చూడు
ఆకురాలిన అలికిడికే ఉలికిపడి లేచేను.
విరహాన వెన్నెలలు వేడిగా తోచేను
ఎదురు చూపుల లోనే వీగి పోతుందేమో ..రేయి
కరుణ లేనీ వాడ ఎక్కడున్నావో ,
మలి ఝాము కూడా మలిగి పోచున్నాది
ప్రణయ దేవత నీవనుచు పరువాల సాక్షిగా
బాసలాడినవన్ని ఊసులేనా..
పది మందిలో నేను ఒకదానినైనాన
నీ ధ్యాస వలదంటు మందలించిన గాని
వినకుండే నామాట …నీదైన నా మనసు …
తొలి ఝాము,మలిఝాము మళ్లి మరుగాయే …
ఎన్ని రేలని ..నీ కొరకు ఎదురు చూసేది …
తొలిచుక్క మరుగాయే ,తొలి సంధ్య మొదలాయే
కలువలన్నియు తడబాటుగా వలువలను కప్పుతూ,
మురిపాల ముచ్చట్ల ముసిముసిగ నవ్వుచూ
కనులతోనే నన్ను గేలి చేస్తున్నాయి …
మోసగాడా మరి రాకు…మరలి రాకు
విసిగి పోతిని నేను వేసారి పోతి….
.మాధవా రమ్మని మరి నేను పిలువను ….
మాయగాడా మరి రాకు వెడలి పొమ్ము…….