గజల్ విజయ గోలి
మరులుగొలుపు నీఊసులు మదిలోనే దాచేస్తా
ఎరుపెక్కిన నాచెక్కిలి కానుకగా పంచేస్తా
కొమ్మకొమ్మ కోయిలమ్మ నీపాటలె పాడేనులె
రాలుతున్న రాగాలను కొంగులోన నింపేస్తా
వెన్నెలమ్మ దారులలో జాబిలమ్మ వేదికగా
తళుకుబెళుకు తారలనే తలంబ్రాలు పోసేస్తా
రేరాణీ గంధాలతొ రేయంతా సందడులే
మత్తుకనుల మధువులనే పెదవులపై ఒంపేస్తా
రెల్లుపూల తెప్పలపై నునుసిగ్గులు పరిచేసా
పొగడపూల పొదరిళ్ళను విడిదిల్లుగ చేసేస్తా