గజల్. విజయ గోలి
తొలిప్రేమ సంతకమే చేసేనులె తొలకరిలో
పెదవులపై మధువులతో వ్రాసేనులె తొలకరిలో
దూరాలతొ భారాలతొ గడిచినవే ఘడియలెన్నొ
గుండెలలో గుబులేదో తొలిచేనులె తొలకరిలో
అందుకున్న లేఖలలో గులాబీల గుభాళింపు
నీ రాకల సవ్వడినే.తెలిపేనులె తొలకరిలో
తలపులేవొ తడిమినవే తలవాకిలి చూపులతో
కనులద్దిన కాటుకలే కరిగేనులె తొలకరిలో
గదిలోపలి దీపములో చిరునవ్వుల విజయములే
నునుసిగ్గులు పూవులుగా విరిసేనులె తొలకరిలో