తూఫాన్ విజయ గోలి
తుఫాను ముందు ప్రశాంతత లాగా..
నిశీధిలో నిశ్శబ్దం నిలువెల్ల భయపెడుతుంది .
ఒక్కసారిగా మొదలైన ఊహించిన ప్రళయం..
మబ్బుల మధ్య మొదలైన మెరుపుల యుద్ధం ..
పిడుగుల శబ్ధం నిశ్శబ్దాన్ని పిండి ..చేస్తుంది
పెనుగులాడిన పసితనం పాశవికత ముందు …
పతనమై కొన ఊపిరి తో కొట్టుకుంటూ …
రాలుతున్న చినుకుల సవ్వడి కి
తడి కన్నుల ఆర్తి తెలిసిందేమో .
సవ్వడి స్థాయి తగ్గించుకుంది .
గొంతు పెగలని పొలికేకగా..
ఉరుముల శబ్దంలో ఊపిరాగిపోయింది …
నిశబ్దమే బాగుంది నిశ్చలంగా ..
తడిసిన బ్రతుకుకు చితి పేర్చుకున్న ..తనువును
రాజుకున్న నిప్పు అమ్మగా అక్కున చేర్చుకుంది …
మదమెక్కిన మృగాల వేటకు …
ఎన్ని లేడికూనలు ఎర గా నలగాలో …
కోటికి ఒక న్యాయం జరిగితే …
కొండంత సంబర పడిపోయే లోకం….
మదించిన మృగాల పై వేటకెందుకు
వెనుకాడుతుందో….విజయ గోలి.