*గజల్ …రచన విజయ గోలి
కలనైనా కన్నుకలిపి చూడవేమి తనివితీర
ఊహలలో ఊసులాడ పిలవవేమి తనివితీర
చల్లగాలి అల్లుకుంటె ఈసుఏల ప్రేమలలో
నీలికురుల దోబూచులు ఆడవేమి తనివితీర
తొలినాడు మలినాడు మరలిరావు ఎన్నటికీ
వసంతమే వచ్చువేళ పాడవేమి తనివితీర
చిరుఅలుకలు విరిజల్లుల చినుకులేగ సాగరాన
తొలిసంధ్యల మలిసంధ్యల తలవవేమి తనివితీర
కలహాలకు విరహాలకు కలయికలే విజయ ము కద
మధురోహల ఊయలలో ఊగవేమి తనివితీర