శుభోదయం🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
జ్ఞానజ్యోతి పుస్తకం
చదివిచూడు పుస్తకాలు పరిపక్వత యాగాలే
స్వప్నాలతొ పొందలేవు… సఫలతకవి మార్గాలే
ఏకాగ్రత నీదైతే ..శిఖరాగ్రమె నీ స్థానం
భవితంతా పసిడికోట … ప్రతిధ్వనిగ హర్షాలే
గ్రంధమంటె స్వరపరిచిన సృష్టి లోని రాగాలే
చరిత్రకే చక్షువులై దారిచూపు ద్వారాలే
విజ్ఞానపు పరంజ్యోతి కాంతులలో పురాణాలు
జిజ్ఞాసలు వూపిరిగా అధిరోహణ పర్వాలే
మాటాడును అక్షరాలు మనసుకలత పడినప్పుడు
మస్తకాన్ని నేస్తంగా సేదతీర్చు హర్మ్యాలే
అందుకోను అనంతాలు …ఆశయాల సాధనాలు
మేధావులు మేలుకొలిపి అందించిన స్వర్గాలే!
జ్ఞాన జ్యోతి వెలుగుల్లో ప్రగతి పధం విజయరధం
సాగుతుంది పుస్తకాల జైత్ర యాత్ర యజ్ఞాలే !!