…గజల్
రచన -: విజయ గోలి
జీవితమే పొత్తమైతె ముందేమిటొ తెలిపేదిగ
జాడలేని జ్ఞాపకాల రేపేమిటొ తెలిపేదిగ
వ్యధలున్నా పేజీలను వ్యర్ధంగా చింపివేసి
హృదికదిలె పాటలలో మధువేమిటొ తెలిపేదిగ
గుండెలలో దిగిపోయిన గాయాలతొ బ్రతుకేమి
తడిఆరని ప్రేమలసడి విలువేమిటొ తెలిపేదిగ
కాలానికి కళ్ళెమేసి వెనుకవన్ని ముందుకొస్తే
పూలదాగు ముళ్ళపైన నడకేమిటొ తెలిపేదిగ
నీలినీడల పరదాలను మౌనంగా తొలగించితె
ఉదయాలతొ కలసివచ్చు విజయమేదొ తెలిపేదిగ