చేవ్రాలు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

గజల్. విజయ గోలి

చెలిమనసున చెరిగిపోని చేవ్రాలే చేసినావు
తొలిసారిగ ప్రమోదాల మనోవీణ మీటినావు

అడుగడుగున అరచేతుల గులాబీలె నింపినావు
వలపుపూల నెత్తావుల ఊయలలే ఊపినావు

కనులుమూసి తెరిచే లోగ కడలిఅలల నిలిపినావు
అలరారే ఆశలపై అగ్గిపూలు జల్లినావు

పగపట్టిన కాలమేల కారణాలు చెప్పదెపుడు
వసివాడని పూలతీగ అల్లికలే చూపినావు

కరుగుతుంది సంతకమే కన్నీరుల చెలమలలో
దరితెలియని దారులలో దయలేక వదిలినావు

నీ గుండెన తీపిగురుతు నేనన్నది నమ్మకమే
నిశీధిలో నీ నీడల జ్ఞాపకాలు దాచినావు

చేయివదిలి దూరమైన చేరువకై వేచినాను
చిత్తరువున వెలిసిపోని రంగులనే వొంపినావు

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language