చిత్రవీణ “తెలుగు గజళ్ళు విజయ గోలి
సంపుటి శీర్షిక *చిత్రవీణ
చిత్రవీణ పాడినదీ ఛైత్రవర్ణ రాగాలే
వనమంతా ఆలపించె వలపు సిరుల గానాలే
ఒకసారీ సరాగమై ఒకసారీ వియోగమై
చందమామ కళలతీరు మనసంతా మంద్రాలే
పొంగిపోవు భావాలతొ ఎదమీటిన తరంగాలు
మొయిలునీడ మయూరమై ఆడినదీ నాట్యాలే
మరునిమిషం మౌనాలతొ శృతి చేయని వీణియగా
స్పందించని హృదయంలో సమరంగా శూన్యాలే
పూవుకొక్క పల్లవిగా పరిమళించు రసవిపంచి
మధుపముకై మధురంగా మధువు నింపు లాస్యాలే
పలుతీరుల పలుకరించు పలుకలేని పవనాలే
ముకుళించును కలువబోలు మోయలేని విరహాలే
ఇంద్ర ధనువు రంగులలో ఇమిడిపోవు చిత్రమదే…
రంగుకొక్క రాగమవును విజయ వీణ సుస్వరాలె
1) కనుల కొలను
కనులకొలను తరగలపై ఆడుతున్న కలనీవుగ
కడలిఅలల నురగలపై తేలుతున్న కలనీవుగ
నీలినీలి ఆకశాన నిశిమెరిసిన చందమామ
తారలాడు తరుణంలో తళుకుమన్న కలనీవుగ
పున్నాగల పూలజల్లు పరిచినదే పరిమళాలు
ముత్యమంత ముద్దుగా మెరుస్తున్న కలనీవుగ
వేకువలో భూపాలమై ఎదమీటిన రాగముగా
కోయిలమ్మ పాటలలో పాడుతున్న కలనీవుగ
కవనములో అక్షరాలు అమరుతున్న విజయంగా
తొలి గజలుగ చిరుచిగురుల ఎదుగుతున్న కలనీవుగ
2) చుక్కలంట చూడబోకు
చుక్కలంట చూడబోకు చెలిమికోరి చెలికాడా
దిక్కులంట వెళ్ళబోకు కలిమికోరి చెలికాడా
గుండెలలో గూడేసా గుట్టుగానె ఉండిపోర
ప్రేమ తోరం కట్టాను మదినికోరి చెలికాడా
మనసుతెలిసి కలిసిపోర ఉనికిలోన ఊపిరిగా
కంటినిండ నిలిచిపోర కాంతికోరి చెలికాడా
రాసుకున్న రాతలనే గీతదాటి పోనీయకు
చేతిలోన చెయ్యివేస్తి …చేరికోరి చెలికాడా
బ్రహ్మముడిని విడతీయగ సమ్మతమే కాదెపుడూ
“విజయ మెపుడు ఇద్దరిదీ నియతికోరి చెలికాడా
3) వికసించిన మందారం
వికసించిన మందారం విరుపులాయె మానసమే
అందాలతొ బంధించే వలపులాయె మానసమే
కలగన్నవి కాంచనమై కనులముందు నిలిచినవే
కళ్యాణమే కమనీయపు తలపులాయె మానసమే
తెరచాటున ఓరచూపు మధురూహల మందసమే
చూపులతో విరితూపుల జల్లులాయె మానసమే
మధుపర్కపు చిన్నెలలో పసిడిరంగు మెరిసినదే
మూడుముళ్ళ తాకిడిలో వెల్లువాయె మానసమే
తలంబ్రాల తళుకులలో తొలకరులే కురిసాయిలె
కొంగుముడుల కోలాటపు కొలువాయే మానసమే
ఏడడుగుల నడకలలో మునివేళ్ళ ముద్దులతో
ఎదలోపల పులకింతల పువ్వులాయె మానసమే
అంబరాన కురుస్తున్న ఆశీసుల అక్షింతలు
అవనిఅంత గెలుచుకున్న “విజయ”మాయె మానసమే
4)పుచ్చ పూల వెన్నెలలో
పుచ్చపూల వెన్నెలలో జగమెంతో మనోహరం
పూలతోడి పులకించిన వనమెంతో మనోహరం
పాలపిట్ట ఈలపాట అలలబాట ఆమనియే
పడవలోని పడుచుజంట పాటలెంతొ మనోహరం
ఎదురీతల పులసలతో ఏటివాలు అద్భుతమే
ఒడిదుడుకులు చూడకుంటె ఊహలెంతొ మనోహరం
నవ్వులన్ని నలువైపుల జల్లుతుంటె ఆహ్లాదం
నడకలలో మానవతా అడుగులెంతొ మనోహరం
అపురూపం మనుజజన్మ విలువలతో విరపూస్తే
వికసించే పరిమళాల* విజయమెంతొ మనోహరం
5)అమ్మ
కోడికూత పిలుపులలో పలుకేకద అమ్మంటే
తొలి పొద్దున సింధూరపు మెరుపేకద అమ్మంటే
ముంగిటిలో రంగవల్లి మురిపాల నవ్వులలో
తూరుపునా తులసిముందు దివ్వే కద అమ్మంటే
నట్టింటిన మట్టెలతో పసుపంటిన పాదాలే
చేతలలో చిరుగాజుల సడియేకద అమ్మంటే
నడిమింటన ఉయ్యాలకు నడిరేయిన లాలిపాట
అలుపులేని అలరింపుల దేవత కద అమ్మంటే
చద్దిలోన చల్లకలిపి ముద్దలుగా ముద్దారగ
ముచ్చటలో బొజ్జనింపు మమతేకద అమ్మంటే
తల్లివున్న ప్రతిఇల్లు ఆనందపు హరివిల్లే
ఇంటింటా వేలుపైన బ్రహ్మేకద అమ్మంటే
అమ్మవుంటె అదృష్టము ఆమాటే *విజయంగా
కల్పతరువు మించినట్టి కలిమేకద అమ్మంటే
6)గుండె గూటి గురుతులు
గుండెగూటి గురుతులతో ఆడనీయి కలకాలం
గువ్వలాడు గుసగుసలే పాడనీయి కలకాలం
వనమంతా సుమచరుడే శరములతో తిరిగేనులె
హరుడికన్ను తెరవకుండ ఆపనీయి కలకాలం
శిశిరాలలో దాగాయిలె వసంతాల తొలిచిగురులు
రాలిపోని హరితాలనే ఎదగనీయి కలకాలం
కలసిరాని కలుములేల మదినెరిగిన మైత్రిచాలు
కోరికలకు తారలనే రాలనీయి కలకాలం
మంచివెంట నీడలాగ నడిచేదిక విజయమేగ
వేడుకునే వేదనలకు విలువనీయి కలకాలం
7)వెన్నెలంటి నీఅందం
వెన్నెలంటి నీఅందం వేడుకేలె చూడగానె
ఎవరిచూపు సోకనీకు సోలేనే చూడగానె
నీలికొంగు పరదాలో దాచివుంచు సిరిమోమును
నాచూపుల నలుపేదో తగిలేనే చూడగానె
ఒంటరిగా తిరుగాడకు వన్నెలకే చూపుతగులు
పసిడిపూల పాలకంకె వడిలేనే చూడగానె
నడకలలో నాజూకుల నాగమల్లి నవ్వేనువ్వు
అడుగులలో అలకనంద అలిగేనే చూడగానె
చెక్కిలిపై ముంగురులే ముద్దులాడ మురిపములే
సందెగాలి ఆటలకే అలిసేనే చూడగానె
నీకునీవు చూడబోకు అద్దములో అందాలను
నీ చూపున బాకులేవొ తాకేనే చూడగానె
నీసొగసుకె దిష్టిచుక్క సరిచాలదు చందమామ
మెరుపుతీగ మబ్బులలో మలిగేనే చూడగానె
8)తొలిప్రేమ సంతకం
తొలిప్రేమ సంతకమే చేసేనులె తొలకరిలో
పెదవులపై మధువులతో వ్రాసేనులె తొలకరిలో
దూరాలతొ భారాలతొ గడిచినవే ఘడియలెన్నొ
గుండెలలో గుబులేదో తొలిచేనులె తొలకరిలో
అందుకున్న లేఖలలో గులాబీల గుభాళింపు
నీ రాకల సవ్వడినే.తెలిపేనులె తొలకరిలో
తలపులేవొ తడిమినవే తలవాకిలి చూపులతో
కనులద్దిన కాటుకలే కరిగేనులె తొలకరిలో
గదిలోపలి దీపములో చిరునవ్వుల విజయములే
నునుసిగ్గులు పూవులుగా విరిసేనులె తొలకరిలో
9)పిలిచినీకు పిల్లనిస్తే
పిలిచినీకు పిల్లనిస్తె వొల్లవంట ఎందుకంట
అలిగినీవు చేసేవట అల్లరంట ఎందుకంట
మంచెమీద వడిసెతిప్పు వాటమెరిగి వున్నదిలే
కంచెమీద కాపలాలు కాస్తవంట ఎందుకంట
రంగురాళ్ళ మధ్యలోన రతనమేదొ తెలియకుండె
రాలుగాయి సేయితాలు మానవంట ఎందుకంట
అక్కరలో చక్కెరగా ఆదుకుంటె అత్తమామ
కన్నోళ్ళదె కడుపుమంట కానవంట ఎందుకంట
కడుపుచూసి అమ్మపెడితె కలకాలం ఆలికదా
కావడిలో కుండలుండ మరల వంట ఎందుకంట
10)వస్తావనే ఒకరోజును
వస్తావనె ఒకరోజును ఆశలుగా అనలేనులె
వస్తాననె నీబాసను ఊహలుగా అనలేనులె
మనసెంతో హాయిగుంది.ఆవలపుల బాటలోన
ఆతలపుల నిలుచుటనగ పిలుపులుగా అనలేనులె
నిలవనంది నామనసే నినుచూసిన నాటినుండి
చెప్పుకోను బంధమని గాఢముగా అనలేనులె
శవమునేను జీవముతో యోచనలో ఏమున్నది
పరాయివనె అనుకోనులె …సొంతముగా అనలేనులె
కూలివున్న శిథిలాలపై సౌధమెలా కట్టగలను
నీవులేక బ్రతకుటనగ విజయముగా అనలేనులె
11)అందమైన భావనలుగ
అందమైన భావనలుగ భ్రమరాలే ముసిరెనులే
మధురమైన బంధాలుగ సోయగాలె మెరిసెనులే
అతివతెలియ బ్రహ్మ కైన అవనిమీద అందనిదే
అరుణిమలే ఆమోమున చిరుఅలకలె కులికెనులే
లాలనలో లలనలెపుడు లతలేగా హృదిపైనా
లజ్జితగా ముకుళించగ లలితాలే విరిసెనులే
అధిష్టించ అతివమనసు ఆయాసము తప్పదుగా
అలుపుతీర సహనములో సుస్వరాలు పాడెనులే
తెరిచిఉన్న పుస్తకమే తెలియరాని సాగరమే
సానపెట్ట విజయాలతొ సాహసాలు సాగెనులే
12)మౌనమేల చీకటినే
మౌనమేల చీకటినే దుప్పటిగా కప్పుకుంది
ఎవరిననీ అడగగలను ఎందుకిలా జరుగుతుంది
ఆగిపోయి శ్వాసలేల ఎగిరిపోయె ఎక్కడికో
గుండెనొదిలి చప్పుడేల గుట్టుగాను దాగుతుంది
సద్దుమణిగె సంతోషం ఎక్కడనీ వెతక గలను
చుట్టుముట్టు జ్ఞాపకాలు సునామీగ చుట్టుతుంది
మదిని దాగి మాటలేల పెదవి దాటి రాకున్నవి
తనువు నొదిలి నీడెందుకు నిశీధిలో కరుగుతుంది
యోచనకే అందవుగా అంతులేని ప్రశ్నలుగా
కాలమిచ్చు జవాబుకై బ్రతుకుబాట వెతుకుతుంది
13)నేల తడిపిన చినుకులు
నేలతడిపిన చినుకులెపుడో ఆరిపోయే కళ్ళముందే
గుండెనవ్విన గురుతులక్కడె ఆగిపోయే కళ్ళముందే
మోడువారిన చెట్టుపైనా చిగురులెక్కడ పలుకరించు
చిన్నపోయిన చిలుకలన్నియు చెదిరిపోయే కళ్ళముందే
మలిగిపోయిన మమతలింకా మళ్ళిరావులే మార్గమందు
ఎదురుచూపులు వెన్నుతట్టుతు వెళ్ళిపోయే కళ్ళముందే
కనికరించని కలతలన్నియు కావ్యమాయె కాలమందున
కనులనిలిచిన కలల రూపం కరిగిపోయే కళ్ళముందే
కొడిగట్టినది రంగులదీపం వెంటరాని వెలుగునొదిలీ
కనులకొసలన నీటిచుక్కగ జారిపోయే కళ్ళముందే
14)అందినంత ప్రేమలనే
(పంకజ్ ఉదాస్ జీ పాడిన ఒక గజల్ ఆధారంగారాసినది)
అందినంత ప్రేమలనే పంచుకున్న జ్ఞాపకమే
కడలినంత కన్నులలో దాచుకున్న జ్ఞాపకమే
తొలిసారిగ నాకన్నుల నిలచినదే నీరూపము
మునిపంటిన నడమివేలు కొరుకుతున్న జ్ఞాపకమే
హేమంతపు సంధ్యలలొ దాగిదాగి వేచినదే
ప్రేమనంత గుండెలలో నింపుకున్న జ్ఞాపకమే
చెలిమిలోని చెరుకుతీపి మరువలేని మధురగీతి
ప్రాణాలతొ ప్రమాణాలు చేసుకున్న జ్ఞాపకమే
గుండెచిదిమి గురుతులనే గునపాలతొ గుచ్చినదే
రుధిరంలో మల్లెపూలు విచ్చుకున్న జ్ఞాపకమే
మెహఫిల్ లో మందాకిని మంజీరం సవ్వడులే
ఖవ్వాలీల కధనాలలొ పాడుతున్న జ్ఞాపకమే
నీచూపే విజయ మైతె ఎప్పటికీ అదినాదే
తొలిచూపుల ఛద్దర్ నే కప్పుకున్న జ్ఞాపకమే
15)ఎదగాయం లోతెంతో.
ఎదగాయం లోతెంతో ఎవరెవరికి తెలుసునోయి
చిరునవ్వుల సింగారపు బరువెవరికి తెలుసునోయి
నీటకరిగే మాటకాదు హృదిపైనా పచ్చబొట్టు
పదిలంగా చెక్కుకున్న రూపెవరికి తెలుసునోయి
వలవిసిరిన జాలరితో వలపుఆట గెలవలేదు
ఓడివున్న ఒంటరిలో వెలితెవరికి తెలుసునోయి
కాలంలో కనుమరుగౌ కనిపించే వ్యధలెన్నో
మరుగవ్వని మధురమైన కలతెవరికి తెలుసునోయి
కన్నీటితొ నిశిని కడిగి ఉషోదయపు వేదికపై
వెలుగు రంగు లద్దుకునే వెతలెవరికి తెలుసునోయి
16)పరుగెందుకె జీవితమా
పరుగెందుకె జీవితమా పనులేవో మిగిలాయిలె
బంధాలతొ బాధ్యతల బరువులేవొ మిగిలాయిలె
నీఅడుగుల వడిలోన నలిగిపోయి అలిగాయిలె
అలకతీర్చి పంచుటకై నవ్వులేవొ మిగిలాయిలె
ఆశలేవి తీరలేదు అనుకున్నవి జరగలేదు
దాచలేని మదినిండిన వ్యధలేవొ మిగిలాయిలె
ముందునడువు జీవితమా నిన్నుదాటి పోలేనులె
హక్కులున్న హృదయంతొ మాటలేవొ మిగిలాయిలె
కడసారిగ చెప్పలేను * విజయంగా వీడుకోలు
కాఫిన్ లో దాచేసే కధలేవో మిగిలాయిలె.
ప్రముఖ ఉర్దూ హిందీ కవి
శ్రీ గుల్జార్ గారి ఒక గజల్ కు నా అనువాద ప్రయత్నం.
17) అమ్మ వడిన
అమ్మవడిన ఆడుకున్న తలపొక్కటి నవ్వింది
కాగితాల పడవలతో కాలమొకటి నవ్వింది
వనమంతా విరపూసిన పరిమళాల చిరుజల్లు
ఆటాడిన ఆదమరుపు అందమొకటి నవ్వింది
తొలిప్రేమల విరహాలతొ తులతూగిన మబ్బులలొ
దాగివున్న చుక్కపూల మెరుపొక్కటి నవ్వింది
ఒడిదుడుకుల నడకలలో ఒదగలేని దారులలొ
తడబడిన అడుగులలొ మరుపొక్కటి నవ్వింది
గుండెలలో నిండివున్న వెలుగునీడ చిన్నెలుగ
మలిసంధ్యన మలిగిపోని గురుతొక్కటి నవ్వింది
18)జత కలవని జవాబులు
జత కలవని జవాబులే ప్రశ్నలుగా మిగిలిపోవు
కలవలేని రాతలతో కల్లలుగా మిగిలిపోవు
కనులచాటు కల్పనేదొ అనుభవమై అద్భుతమే
తపియించిన బంధమేదొ తపనలుగా మిగిలిపోవు
నిన్నునన్ను కలబోసిన కలలతోటి అభిషేకం
మదికోవెల దైవానికి పూజలుగా మిగిలిపోవు
కనులాడిన బాసలెపుడు కమనీయం కానుకగా
ఆమాటల సడిఎపుడూ మంత్రాలుగ మిగిలిపోవు
అడుగడుగున మేలుకొలుపు విజయాలుగ నిలిచిపోవు
దరిచేర్చే దారులలో వెలుగులుగా మిగిలిపోవు
19)జారిన ఆమని
జారిన ఆమని జాడలు మలిగెను
ఓడిన ప్రేమల నీడలు కదిలెను
కరగని శిశిరం దారులు మూసెను
కలతల శిబిరం తలుపులు తెరిచెను
వేదన వేచెను వేకువ వెలుగుకు
తీరము చేరని అలగా నలిగెను
కనులు జారిన కలల రూపమె
చెరగని మరకగ చెక్కిలి నిలిచెను
మనసుల మెలిగిన వ్యధనే గాధగ
నసీబు వ్రాసిన కితాబు మిగిలెను
20)ఒక్క నవ్వు కానుక
ఒక్క నవ్వు కానుకగా ఇవ్వలేవ ఒక్కసారి
కలనైనా నీరూపును చూపలేవ ఒక్కసారి
ఎదురుచూతు ప్రియతమా వేలవేల జన్మలైన
వసంతమై వచ్చెదనని పలకలేవ ఒక్కసారి
మరుజన్మల వరమన్నది ఆశలేగ ఎప్పటికీ
పదిలముగా నీ ప్రేమని పంచలేవ ఒక్కసారి
నీఊసులు మోసిమోసి గాయపడిన గుండెనడుగు
వెనుకతిరిగి వేదనేదొ చూడలేవ ఒక్కసారి
మధువులోని మత్తులాగా వదలకుంది నీ ధ్యాసే
మౌనమేల మనసుతలుపు తీయలేవ ఒక్కసారి
21)తొలిసారిగ ప్రేమలేఖ
తొలిసారిగ ప్రేమలేఖ వ్రాయాలని అనుకున్నా
నీప్రేమకు చిరునామా కావాలని అనుకున్నా
అడగాలని అనిపించదు నీఅనుమతి కానుకగా
అలజడిలో అనుభవమే అందాలని అనుకున్నా
అవునన్నా కాదనినా నీతలపులొ నిలిచిపోగ
చిరు నవ్వుల సంతకాలు చేయాలని అనుకున్నా
మదివీణను శృతిచేసా మమతకోరి వ్రాసానుగ
రాయంచనె రాయబారం కోరాలని అనుకున్నా
గాలివాలు గమనాలకు గమ్యాన్నే చెపుతున్నా
ఇగిరిపోని గంధాలను ఇవ్వాలని అనుకున్నా
ఛమేలీల చిలిపితనపు వలపునింపి వ్రాసాను
పసిడిపూల తేరులపై పంపాలని అనుకున్నా
కలలనిన్ను నిలుపుకొని అల్లుకున్న ప్రేమకధగ
విజయాలతొ కావ్యంగా మిగలాలని అనుకున్నా
22)కనుల నుండి నారూపం
మనసునుండి నాప్రేమను మలపగలవ ప్రియతమా
కనులనుండి నారూపం చెరపగలవ ప్రియతమా
మధురమైన జ్ఞాపకాలు మనసువదిలి పోలేవు
కాదంటూ కన్నీటిని దాచగలవ ప్రియతమా
పచ్చబొట్టు ప్రమాణం పచ్చనిదే పరిమళం
వెచ్చదనం వదిలివేసి వెళ్ళగలవ ప్రియతమా
దూరమెంత నడిచిననూ దారులన్నీ నావేలె
లేదంటూ నీఅలసట ఆపగలవ ప్రియతమా
ఊపిరినై నీఉసురులొ వెలుగుతున్న దీపమునె
మరలివచ్చు మాటొక్కటి చెప్పగలవ ప్రియతమా
23)అంది వచ్చు అవకాశం
అందివచ్చు అవకాశం అందుకొనుట తెలియాలి
ఆశయాల దారులలో అడుగేయుట తెలియాలి
పూలతోడు ముళ్ళుంటే అదునుతెలిసి తెంపాలిj
అడ్డమొచ్చు ఆపదలను అదిలించుట తెలియాలి
నల్లమబ్బు నీడలెపుడు తోడురావు కలకాలం
ఎడారిలో ఎదురునడక ఎరిగుండుట తెలియాలి
మేధావుల సూచికెపుడు మేరువులే చూపించు
నీకునీవు ఎదుగుటలో ఒదిగుండుట తెలియాలి
సాగరాన చినుకులాగ కలిసిపోతె విజయమా?
కోటికొక్క మనిషిలాగ కొలువుండుట తెలియాలి!
24)గల్మొహరుల గుత్తులు
గుల్మొహరుల గుత్తులలో నీనవ్వుల గుబాళింపు
హత్తుకున్న పరిమళాల నీసొగసుల మేళవింపు
మత్తిల్లిన చూపులలో రేరాణీ వలపుజల్లు
మధువునింపి అధరాలపై తీయదనం మోహరింపు
వేలవేల తారలలో వెదికననూ దొరకనిదే
కరిమబ్బులొ మెరుపుతీగ వంపులలో నిగారింపు
దోచేసిన నామనసును దాచలేవు కలనైనా
సందెగాలి షహనాయి సరాగాల హొయలునింపు
కలసినడుచు దారులన్నీ కమ్మనైన కబురులుగా
తెలవారని రేయిగాను నీచేతల తలపునింపు
25)నీ నవ్వులొ మువ్వలేవొ
నీనవ్వులొ మువ్వలేవొ రాలినట్లు ఉన్నదిలే
పలుకులలో తేనెలేవొ ఒలికినట్లు ఉన్నదిలే
చూపులలో సూదంటుల గాలమేదొ దాగున్నది
చిలిపితనం చిలకలన్ని కులికినట్లు ఉన్నదిలే
వొంపుసొంపు వొదిగిపోయె వసంతమే నీవుగా
నడకలలో నదులేవో కదిలినట్లు ఉన్నదిలే
నాణెమైన నాప్రేమను నైవేద్యం పెడుతున్నా
కరుణించిన దైవమేదో వచ్చినట్లు ఉన్నదిలే
పూవుతావి సంబరంగ సరిజోడుగ మనబంధం
విరపూసిన నాగమల్లి నవ్వినట్లు ఉన్నదిలే
26)కోరుకున్న కలలమేడ
కోరుకున్న కలలమేడ శిధిలాలుగ మారుతుంది
కన్నీటిలో ఎదురీతలు కలవరముగ మారుతుంది
అమావాస పున్నములే అలుపెరుగక నడిచిననూ
ఆశలతో ఎదురుచూపు అలవాటుగ మారుతుంది
కనుపాపలు కొడిగట్టిన వెలుగులుగా నిలిచిననూ
ప్రేమఎపుడు ఓడిపోని చరితాలుగ మారుతుంది
వసంతాలు మోసుకొచ్చు నీఊసుల పరిమళాలు
చిగురించే చిరుఆశలు హరితాలుగ మారుతుంది
ఆరాధన అర్చనైతె అందలేని విజయమేది
వమ్ముకాని నమ్మకమే దైవాలుగ మారుతుంది
V
27)తలుపు తట్టి పిలిచినవీ
తలుపుతట్టి పిలిచినవీ ఒకనాటీ తలపులుగా
తలవాకిట నిలిచినవీ తొలకరిలో వలపులుగా
కనులలోనె కన్నీరుగా కరిగిపోని కలలుగానె
ప్రేమనింపి కైజారుతో ఎదచిదిమిన గురుతులుగా
గాజుకళ్ళ నీడలలో దస్కత్తుల జ్ఞాపకాలు
చెమ్మగానె తగిలినవీ చెక్కిలిపై తడుపులుగా
వేదనేదో వేడుకేదో తెలియకనే తెరలుజారె
తోడురాని నీడకొరకు వేచితినీ యుగములుగా
మరుజన్మకు నీజతనే అడుగుతున్నా అలుపులేక
కడచూపుకు నోచకనే ఆరుతున్న వెలుగులుగా
28)గుసగుసగా ఊసులేవొ
గుసగుసగా ఊసులేవొ చెపుతుంటే బాగుంటది
గాలికున్న చెవులేవో వినకుంటే బాగుంటది
చూపులేవొ కలిపేస్తూ చుక్కలలో చక్కర్లుగ
కలబోతలొ కబురులేవొ పంచుకుంటె బాగుంటది
పెదవొంపుల చిరునవ్వులు పలుకునేదొ వలపుమాట
చిలిపిగాలి సిగ్గులలో మొగ్గుతుంటె బాగుంటది
నడిరేయిలొ మనసేమో కలలకడలి మునిగుంటది
తెల్లవారక రేయంతా నిలిచుంటే బాగుంటది
ఎదురుచూపు ఘడియలన్ని ఎదనుమీటు విజయమైతే
కలతలేవి నలతలుగా కాకుంటే బాగుంటది
29)కన్నులార చూడలేదు
కన్నులార చూడలేదు గుండెలోన వేదనాయె
ప్రియమారగ మాటలేదు మనసంతా మౌనమాయె
తరలివచ్చు బాటసారి తలపులేదు తారలకే
గాలివాలు కబురైనా ఆనవాలు చూపదాయె
వలపుపూలు వాడెనేమొ ఆమనియే అలసిపోయె
చిరుగాలుల విసురులాగె చిగురాకుల అలకలాయె
వెన్నెలలో జలతారుల అలలపైన ప్రేమనావ
జ్ఞాపకాల జల్లులలో జలకమాడు కలువలాయె
చందమామ నందుకోను చకోరితో పంతమాయె
కనుపాపల దివ్వెనైతి వెలుగులలో విజయమాయె
30)చెలిమితనం
చింతలలో చెంతచేరు కలిమేగా చెలిమితనం
వెతలలోన వెంటనిలుచు బలమేగా చెలిమితనం
బాల్యములో బంధమైన గుప్పెడున్న గుండెసడిగ
స్నేహాలను మీటుతున్న స్వరమేగా చెలిమితనం
తలపులలో తలచినంత తలుపుతట్టు పిలుపేకదా
నవ్వులలో నవ్వుకలిపి నడకేగా చెలిమితనం
తొలిప్రేమల సందూకమె సరదాలలొ దోస్తానా
తడబడితే అందించే హస్తమేగ చెలిమితనం
కోపాలతొ తాపాలతొ *విజయాలే విందులుగా
శాసించే ఆత్మీయత ఘన హక్కేగ చెలిమితనం
31)మనసెందుకొ గమ్మత్తుగ
మనసెందుకొ గమ్మత్తుగ గగనవీధి తేలుతుంది
ఏమైనదో తెలియకుంది ఎదచప్పుడు పెరుగుతుంది
కనుపాపల లాలిపాడ కరుణించదు నిదురతల్లి
కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది
నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల
అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది
కొత్తఋతువు కోరికలతొ మత్తుగాలి వీచేనులె
మెహఫిల్ లొ గజలల్లే మదినితట్టి లేపుతుంది
గుండెగూటి కోయిలమ్మ ప్రేమపాట పాడుతుంది
వీనులలో విజయంగా షహనాయీ మ్రోగుతుంది
32)నీ దారిన కనులేమొ
నీ దారిన కనులేమో దీపాలుగ నిలిపేను
నీపేరే పెదవులపై మంత్రంగా పలికేను
తలుపులనే తెరచివుంచి తలపులతో వేచేను
కొడిగట్టక సందెదీపం తెలవారగ వెలిగేను
నీమాటల మధువులతో ఊరడింపు కోరేను
నీ కుశలపు ఊసులనే కబురంపగ అడిగేను
కన్నీటినే శాసించా రెప్పదాటి రాకంటు
చిరునవ్వును చెదరనీక నిబ్బరంగ నిలిచేను
తొలిచివేయు చీకటిలో ఒంటరిగా నడిచాను
ఎడబాటుకు తొట్రుపడక మౌనంగా జరిగేను
చిరుచినుకులు తడపకుంటె హరితమెలా ఎదుగుతుంది
సుడిగుండపు వడికెపుడూ దూరంగా కదిలేను
ఎదకదిలే చప్పుడుగా మలిగిపోని విజయ ముగా
జంటగాను జ్ఞాపకాలు వెంటరాగ గెలిచేను
33)ప్రేమ పిచ్చి
ప్రేమ పిచ్చి అంటారే పిచ్చేమిటొ అవగతమే
ఆ ఇరువురి బంధంలో ఇరుసేమిటొ అవగతమే
అవని తల్లి అలజడేమొ మేఘాలకు విదితమేగ
ఎడబాసిన మనసులలో మమతేమిటొ అవగతమే
జాలిపడే లోకానికి కనులనీరు కనపడినా
మేలిమైన ముత్యాలుగ విలువేమిటొ అవగతమే
ప్రేమంటే పిచ్చికాదు మందాకిని సంగమమే
మౌనమేలు బాటలలో మలుపేమిటొ అవగతమే
అంతులేని ప్రేమలలో ఆరాధనె విజయములే
ఒక మీరా మధురమైన భక్తేమిటొ అవగతమే
34)కునుకు రాని ప్రతి రేయి
కునుకురాని ప్రతిరేయీ కధలాగే సాగుతుంది
కన్నీటితొ కనులకొక్క వ్యధలాగే మిగులుతుంది
కలవాలని అనుక్షణం కలవలేక కలతగానె
కాలమంత మరుగవ్వని కలలాగే కదులుతుంది
మనసెందుకు మాటవినక మారాములు చేస్తున్నది
ప్రేమలలో మత్తేమిటో మాయలాగె మెదులుతుంది
నిప్పులాగె కాలుతుంది నీరులాగె జారుతుంది
యుగళంగా అలజడులతొ పాటలాగె పాడుతుంది
ప్రేమన్నది అతిధిలాగ కాకుంటే విజయములే
చెరిసగమై చేరువైతె మధువులాగె మారుతుంది
35)తీపి గురుతు
తీపి గురుతు ఇచ్చావుగ వీడలేని బంధముగా
మరలమరల చదువుకోను మరువలేని గ్రంధముగా
నన్నునేను మలుచుకునే నమ్మకాలు వీగిపోయె
నీవులేని నిజాలనే నమ్మలేని చందముగా
అందమైన నాతోటను ఆమనులే వీడాయిలె
బీడైనది మోడులతో మానలేని గాయముగా
ఎడారిలో వదిలినావు దప్పికార కన్నీటినే
కానుకగా పంచావులె తీరలేని దాహముగా
అలసిపోతి ఆదమరువ ఎద తలగడ కోరితినీ
మిణుగురునై నినుచేరుదు ఆశలేని అందముగా
36)బాటసారి
దారిమరిచి బాటసారి ఊరిలోకి వచ్చినాడు
కూటికొరకు గూటికొరకు గువ్వలాగ వెతికినాడు
పగలంతా శూన్యంగా రేయంతా దైన్యంగా
ఒంటరిగా రేలుపవలు ఒక్కటిగా గడిపినాడు
బ్రతుకుబాట సాగేందుకు ఆశలేదు ఏనాటికి
మరణించగ కారణాలు గతమంతా తవ్వినాడు
పరుగులెత్తు రహదారులు ఆగిపోగ చూడలేదు
తరాలెన్నో ఆదారుల తరలిపోగ చూసినాడు
తడిఆరిన కన్నులలో కడగండ్లే దాచినాడు
బహుదూరపు బాటసారి బంధాలకై వగచినాడు
37)తెల్లనైన మల్లె లాగ
తెల్లనైన మల్లెలాగ మనసులన్ని విచ్చుకుంటె శ్రావణమే
విరబూసిన పూవులన్ని పరిమళాలు రువ్వుతుంటె శ్రావణమే
తనువుతడిచి పుడమితల్లి సింగారపు రంగులద్దె ..పరవశమే
తనివితీర ఎలకోయిల ఋతురాగం పాడుతుంటె శ్రావణమే
సందెగాలి పొద్దులలో సాగిపోవు మబ్బులతో సరాగమే
తేలిపోవు మొయిలులాగ వివాదాలె మార్చుకుంటె శ్రావణమే
ఆషాఢపు గడపదాటి ఆవరణలొ సంబరాల స్వాగతమే
వన్నెకాని చూపులతో వలపుశరం గుచ్చుతుంటె శ్రావణమే
సందడిగా సంధ్యలలో సౌభాగ్యం నవ్వుతుంది భాగ్యముగా
విజయాలే కోరుకుంటు పసుపుపంట పంచుకుంటె శ్రావణమే
38)తెలుగు భాష
తొలిపొద్దున వెలుగురేఖ అందమైన తెలుగుభాష
తేనెఊట తేటగీతి మధురమైన తెలుగుభాష
గాలిలోన గమకాలతొ గంధాలను చిలుకరించు
ఎలకోయిల స్వరములోన రాగమైన తెలుగుభాష
మాటలోన పాటలోన మమతలన్ని రంగరించు
గుమ్మపాల తీపిమించి కమ్మనైన తెలుగుభాష
గోదావరి గలగలలో కృష్ణవేణి పరుగులలో
యాసబాస జతులుకలిపి ఏకమైన తెలుగుభాష
దిగంతాల ఏలుతున్న భువనవిజయ కేతనమే
దేశమాత ముక్కెరలో ముత్యమైన తెలుగుభాష
39)రేపన్నది ఎవరి కెరుక
రేపన్నది ఎవరికెరుక హరివిల్లున రంగులేగ జీవితం
అనుభవించు నేటిరోజు దీపావళి పండుగేగ జీవితం
మృత్యువంటె భయమేల తప్పకోను దారిలేని సత్యమే
ఒడిదుడుకుల వాగులన్నీ ఓరిమితో దాటుటేగ జీవితం
అందరాని చందమామ ఆశతీర అందుకునే తీరాలి
అందలేక కుంగిపోతె అగాధాల అంచులేగ జీవితం
ఎరుకలేని వెరుపెందుకు చెరగనీకు పెదవులపై చిరునవ్వు
బెదిరి పోక నిలబడితే ఎదురులేని గెలుపులేగ జీవితం
నలుగురితో పంచుకునే నడతలుంటె నడకంతా పూదారి
పోయినాక బ్రతికుంటే లోకంలో విజయమేగ జీవితం
40)నా బాల్యం
మధురమైన నాబాల్యం పిలుపు తిరిగి కావాలి
మరువలేని జ్ఞాపకాల మలుపు తిరిగి కావాలి
వయసుతోటి వలసొచ్చిన కలిమంతా కలలేగ
చిన్ననాటి నేస్తాలతొ నవ్వు తిరిగి కావాలి
వాననీటి వాగులలో కాగితాల పడవలతొ
కరిగినట్టి కాలంలో పరుగు తిరిగి కావాలి
చిరుఅలకల చింతలతో చిలిపిచిలిపి అల్లరితొ
చిందాడిన సంబరాల అలుపు తిరిగి కావాలి
పలకమీద పంతులుకు పిలకవేసి ఫక్కుమన
వీపుమీద చింతబరిక ఆట తిరిగి కావాలి
చేలగట్ల దారులపై పతంగులతొ పందేలు
ఏటిలోన ఈదాడిన తలపు తిరిగి కావాలి
పగలురేయి ఒక్కటిగా పరుగెత్తిన స్నేహాలు
కోవెలలో జేగంటల గురుతు తిరిగి కావాలి
41)తప్పులెంచి గొప్పంటె
తప్పులెంచి గొప్పంటే దిగజారును నీ నడతే
ఎత్తిచూపు వేలెపుడూ మలిపిచూపు నీ నడతే
సభ్యతగా మసులుకుంటె పైమెట్టున నీభవితే
గర్వముతో గతితప్పితె అగాధములు నీ నడతే
ఉలిపికట్ట నేనంటే గిరిగీయును ఊరికట్టు
గురివిందగ బ్రతుకైతే నగుబాటులు నీనడతే
కలతపెంచు కాలుష్యం కడిగేస్తే వదిలిపోవు
మాటతీరు మధురమైతె దారివెలుగు నీనడతే
రెచ్చిపోవు మనిషికుంది రెప్పపాటు సమయమే
విజయముగా వెంటనడుచు ఆ నలుగురు నీ నడతే
42)జన్మభూమి
కన్నతల్లి గొప్పదనం తరిగిపోదు ఏనాటికి.
జన్మభూమి ఋణమన్నది తీరిపోదు ఏనాటికి.
శాంతిపధం సమరములో సాధించిన స్వాతంత్ర్యం
త్యాగనిరతి జ్యోతులేవి ఆరిపోవు ఏనాటికి.
ఎగురుతుంది ఎర్రకోటన మువ్వన్నెల లొ భారతం
ధర్మచక్రపు నీలివన్నె మాసిపోదు ఏనాటికి.
వినువీధిన రెపరెపలే విశ్వమంత నింపుతుంది
ఎలుగెత్తిన విజయగీతి ఆగిపోదు ఏనాటికి
వేదమాత నాదేశం సిరివరాల కదంబమే
యుగయుగాల విజ్ఞానం వాడిపోదు ఏనాటికి
వంచలేదు శిరసెక్కడ దించబోదు మరిఎక్కడ
వెనుతిరగని ధీరత్వం ఓడిపోదు ఏనాటికి
నరనరాన గర్వమేగ నాదైనది హిమశిఖరం
భరతమాత బిడ్డగానె నిలిచిపోదు ఏనాటికి
43)కష్టమైన సుఖమైనా
కష్టమైన సుఖమైనా అందరితో పంచుకుంది
పల్లెలోని తియ్యదనం తన బాటను ఎంచుకుంది
మట్టిమిద్దె గట్టితనం దొంగకెపుడు దొరకనిదే
తాతఇల్లు ఆ తరాల కోటలాగే నిలబడుంది
చద్దిముద్ద చల్లదనం ఆప్యాయత ఆనందం
వేసవిలో పైరగాలి ఆదమరుపు అందుకుంది
అనురాగపు పలకరింపు అభిమానపు ఆదరింపు
గుండెనిండు గుర్తింపులు నిండుతనం నింపుకుంది
గోపురాన గువ్వలాడె గుడిగంటల సవ్వడిలో
ఒంటికంటి ఇంటివెలుగు నేడేమిటొ జరుగుతుంది
జమానాలు జల్దిగానే జరిగిపోయె జర ఆగక
శిథిలాలలొ ప్రేమలనే చిత్రాలుగా చూపుతుంది
పంచుకున్న మెతుకులలో పరమాన్నపు తియ్యదనం
కలిసివున్న కలిమినెపుడు విజయాలుగ చెప్పుతుంది
44)కార్యేషు దాసి
కార్యేషు దాసిగా కాలంతొ కలిసేవు కడదాక
సాలీడు గూడులో సంతసం వెతికేవు కడదాక
కరణేషు మంత్రిగా కదనాల నీ రచన ఎదురేది
అబలవే నీవన్న అలుసుతో నలిగేవు కడదాక
భోజ్యేషు మాతవై భువనాల ఆకలే తీర్చేవు
నీ కడుపు కోతలో యుగములే పొగిలేవు కడదాక
రూపేచ లక్ష్మిగా పుట్టింట నట్టింట మెప్పులే
అందమే శాపమై నిప్పులలొ కాలేవు కడదాక
శయనేషు రంభగా సొగసులే పంచేవు సొంపార
మంచు దుప్పటిలోన మరణమే చూసేవు కడదాక
క్షమయా ధరిత్రిగ ఓరిమినె కూరిమిగ తలిచేవు
కాలితో తన్నినా కరుణనే పంచేవు కడదాక
సృష్టియె నీవంటు అడుగుకో గీతనే గీసేరు
షట్కర్మ బంధాల బందీగ నిలిచేవు కడదాకా
45)నీలాల గగనాలు
నీలాల గగనాల హరివిల్లు మెరిసేను
పుడమికే పులకలుగ తొలిజల్లు కురిసేను
ఎదురొచ్చి ఏరువాక ఆశలే నాటింది
రైతన్న కనులలో దివ్వెలై వెలిగేను
తూరుపున వెలుగులే తుళ్ళిపడె జల్లులతొ
పడమరతొ పరిచయం పరవళ్ళు తొణికేను
వాగులే ఒంపులలో వయ్యారం ఒలికేను
తూనీగ ఆటలతొ తుళ్ళింత సాగేను
నెలమూడు వానలుగ వరమిస్తే విజయాలె
రామయ్య రాజ్యమై నవ్వులే విరిసేను
45)కనిపించని సంకెళ్ళు
కనిపించని సంకెళ్ళతొ నడకలింక ఎన్నాళ్ళు
గుండెలపై నెగళ్ళతో కాలుటింక ఎన్నాళ్ళు
అడుగడుగున ఆంక్షలతొ ఆదరింపు ఏమిటనీ
అబల అనే అలతిముసుగు కప్పుటింక ఎన్నాళ్ళు
అవనిమీద నిలిచివున్న అంబరాన మెరిసిననూ
అమ్మాయిగ అణుకువంటు గీతలింక ఎన్నాళ్ళు
ప్రేగుతీపి బలహీనత బంధానికి బలిపశువుగ
గాంధారీ గంతలతో బ్రతుకులింక ఎన్నాళ్ళు
ఉప్పెనగా ఉరికినపుడె సమరంలో విజయములే
అమ్మతనం గుర్తించని అల్పమింక ఎన్నాళ్ళు
46)ఆడపిల్ల
ఆడపిల్ల తండ్రులుగా కొందరిదే ఆనందం
అవనిలోన అమ్మ తాను అందరిదే ఆ బంధం
ఆడబిడ్డ అనగానే అలుసెందుకు అందరికీ
తలుపుతట్టి అడుగెట్టిన శ్రీదేవియె సిరిచందం
పుట్టింటిన ఘల్లుమంటు నడయాడే పసిడి బొమ్మ
మెట్టింటను పుణ్యముగా కురుయునదే శ్రీ గంధం
ఆప్యాయత అనురాగం అంటివుండు నగలేకద
అల్పమైన సంతోషం అడుగునదే అనుబంధం
అమ్మాయికి ఆదరణే అందించిన *విజయ మేగ
అంబరాన దేవతలే జల్లునదే సుమగంధం
47)
48)చేలగట్టు
చేలగట్టు వైరమంత చెరుపుకుంటె చెలిమేగా
వెంటరాని సంపదలను వదులుకుంటె చెలిమేగా
గట్టుమీద పారాడిన గుమ్మడంత ఉమ్మడేగ
ఆటలలో అరటిపండు గురుతుంటే చెలిమేగా
గొబ్బిపూల అందాలతొ గోరింటల చందాలుగ
పంటసాగు నీరంతా పారుతుంటే చెలిమేగా
బంధమెపుడు బాటవెతుకు కలసిపోవు కబురుకొరకు
మధ్యవచ్చు మంధరలే మారుతుంటె చెలిమేగా
బంతిపూల తోరణాలు భాగమౌను *విజయా లతొ
కన్నవాళ్ళ కలలుతెలిసి కలిసుంటే చెలిమేగా
49)కోరినంత కాలమాగి
కోరినంత కాలమాగి పోనిదంట మనకోసం
జారినట్టి జాడెపుడు రానిదంట మనకోసం
పరిచయాలు పాఠాలే చదవుకుంటె బ్రతుకంత
గుడ్డిగవ్వ విలువలేమొ తెలుపునంట మనకోసం
ఎదుటివారి మాటలలో బెల్లమెంతొ తెలియాలిగ
ఎగడుదిగుడు బాటలేవొ చూపునంట మనకోసం
కలలెంతో కమ్మనంటు కాలమంత నిదురేల
కష్టపడక కాసులెపుడు రాలవంట మనకోసం
వేటలోన సింహానికి మెరుపేదో ఎరుకేలే
గురిలోపలి గుట్టుచెప్ప గురువేనట మనకోసం
గిరులెపుడూ నునుపేలే కనుచూపుకు దూరంలో
దరిజేరితె మలుపేమిటొ దాచదంట మనకోసం
మనసెపుడూ ఒంటరైతె మనుగడలో మస్తిలేదు
దోస్తీలో దొరవైతే “విజయ మంత మనకోసం
50)చూడగానె కనుల జేరి
చూడగనే కనులజేరి కలలునింపి పోయావు
తెలియకనే మదిని దోచి వలపునింపి పోయావు
మరువనులే దరహాసం మత్తులోన ముంచావు
చురకత్తుల చురుకుతోటి చూపుదింపి పోయావు
తేనె విందు తేటి యాట తెగువలనే చూసాను
మనసుపడిన వేళలలో మరులునింపి పోయావు
కలువనై వేచి వేచి మందారమై విరిసేను
తొలికిరణపు తోరణాల వెలుగునింపి పోయావు
పొద్దుతిరుగు పూవునేనై దిక్కులన్ని వెదికాను
సందెవేళ సింధూరం నుదురునింపి పోయావు
నడిరేయిన తారకనై తనివితీర చేరగా
మబ్బులలో దాగి నీవు తళుకునింపి పోయావు
అందరాని చందమామ ఆటలలో హాయుంది
పరవశాల పరిమళించు తలపునింపి పోయావు
51)aవిజయ గోలి గజల్
జ్ఞాపకాల పుటలలోన నెమలీకే నాచెలియ
అగరుపూల నెత్తావుల సౌగంధికే నాచెలియ
చినుకులలో చిందేసిన చిన్నతనం తానుగా
జేగంటల సవ్వడిలో సుహాసినే నాచెలియ
వసంతాల వేడుకలో ఇంద్రధనుసు వన్నెలుగ
మల్లెపూల మడుగులలో సౌవర్ణికే నా చెలియ
తళుకుమనే తారలలో జాబిల్లిగ మెరవగా
కలువపూల రేకులపై నీహారికే నాచెలియ
మనసంతా మందిరమే మనసైన దేవతకు
సరిజోడుగ నాతోడున మాళవికే నాచెలియ
52) గజల్…రచన విజయ గోలి
చీకటెనక దివ్వెవుంటె ఎదుటేదో ఎరుకపడును
నిన్నునీలొ చూసుకుంటె వున్నదేదొ ఎరుకపడును
ఆశవుంటే తప్పుకాదు అదుపులేక ఏమిబ్రతుకు
పగ్గమేసి పట్టినపుడె ఒడుపేదో ఎరుకపడును
అలలపైన నిచ్చెనేస్తే అందబోదు ఆకాశం
కలలదారి వెలుతురుంటె గమ్యమేదొ ఎరుకపడును
నీతితప్పె చేతలన్నీ నిట్టనిలువు ముంపులేను
కరకుదనము కరగతీస్తె కలిమేదో ఎరుకపడును
సమరమందు సంధికూడ ఒదిగివున్న విజయ* మేగ
ఎదుగుతుంటె మంచిలోని మత్తేదో ఎరుకపడును
గజల్- విజయ గోలి
తోటనిండ పువ్వులుంటె అందమేగ
ఇంటినిండ నవ్వులుంటె అందమేగ
బంధమెపుడు ఒంటరైతె బాధలేగ
గూటినిండు గువ్వలుంటె అందమేగ
కుండనిండ బువ్వవుంటె కూరిమేగ
ఊరువాడ పంచుకుంటె అందమేగ
జాతరెపుడు పోతురాజు చిందులేగ
దీపావళి జువ్వలుంటె అందమేగ
ఉరుకులాడు వేగమెపుడు యంత్రాలే
పైరగాలి పడుచులుంటె అందమేగ
రచ్చబండ రాచరికం రంగులేగ
రాలుగాయి కుర్రలుంటె అందమేగ
గుడినగంట మ్రోగుతుంటె *విజయ మేగ
కంచిచేరక కధలుంటె అందమేగ