మల్లినాధ సూరి కళాపీఠం
గోదాదేవి విజయ గోలి
విష్ణుచిత్తుని ఇంట
విరివనములో
తులసి పాదున పూసె
శ్రీ లక్ష్మి ఆండాళ్ళు తల్లి
కృష్ణలీలలు వింటు
విష్ణుపూజలు చేస్తూ
ముద్దు మురిపాల
పెరిగేను శ్రీ రంగవల్లి
రంగురంగుల మాలలల్లి
రంగదేవుని కర్పించి
అర్చనలు చేయుచు
అంతరంగమునె
అర్పించె అచ్యుతవల్లి
గోవిందుని కన్న ముందుగా
అల్లిన మాలల అలంకరించి
కొలనునీడల చూసి మురిసేను
అన్నులమిన్న గోదా తల్లి
విష్ణుచిత్తుడు అది చూసి
విషణ్ణుడై పరి పరి విధముల
బుజ్జగించగ చూడ గోదాను
కాదనుచు సఖుల గూడి
ధనుర్మాసము మొదలు
కఠిన నియమములతోడ
పాశురములు ముప్పది
పాడుచును పరమ భక్తితో
శ్రీవ్రతము చేసేను శ్రీకృష్ణుడే
పతియనుచు చిత్తమున
రంగనాధుడే మెచ్చి
కలల కనిపించి
శ్రీరంగము పిలిపించి
గోదాదేవి కళ్యాణమాడి
ఇష్టసఖిగ స్వామిలో
ఇమిడి పోగా
భోగిరోజున వైభోగమున
గోదా కళ్యాణము
దర్శించు వారల జన్మ ధన్యముగ
దీవించు శ్రీ రంగ నాధుడు