గజల్ విజయ గోలి
గుసగుసగా ఊసులేవొ చెపుతుంటే బాగుంటది
గాలికున్న చెవులేవో వినకుంటే బాగుంటది
చూపులేవొ కలిపేస్తూ చుక్కలలో చక్కర్లుగ
కలబోతలొ కబురులేవొ పంచుకుంటె బాగుంటది
పెదవొంపుల చిరునవ్వులు పలుకునేదొ వలపుమాట
చిలిపిగాలి సిగ్గులలో మొగ్గుతుంటె బాగుంటది
నడిరేయిలొ మనసేమో కలలకడలి మునిగుంటది
తెల్లవారక రేయంతా నిలిచుంటే బాగుంటది
ఎదురుచూపు ఘడియలన్ని ఎదనుమీటు విజయమైతే
కలతలేవి నలతలుగా కాకుంటే బాగుంటది