గజల్ విజయ గోలి
గుండెనిండ పండివున్న గురుతులన్నీ రాలిపోయె
కనులువెనుక నిలిచివున్న కడలిలోన దాగిపోయె
శిరసొంచితె శిలమారెను దేవుడిగా ఎదలోపల
కరకుతనం కానుకయ్యె రాయన్నది మరిచిపోతె
అమృతాన్ని పంచినావు ఆశలన్నీ తుంచినావు
విరిజల్లుల మంపులోన విషమేదో కురిసిపోయె
ఉషస్సులో వెలుగురేఖ వెచ్చదనం నీవైతివి
నీలికురుల చాటులలో చీకటులే నిలిచిపోయె
నవ్వులలో నగిషీలే మెరుపులోని వంపుతెలిపె
అడుగులోన అడుగేసిన నడకలన్నీ ఆగిపోయె
చలువరాతి సౌధాలలొ సమాధులే కట్టలేను
వెలకట్టగ వన్నెమాసి వెన్నెలలే మిగిలిపోయె
మౌనంగా మరణాన్నే శాసనంగ వ్రాసావుగ
బాసలతో బాటలేసి విజయాలే ఓడిపోయె