గత వైభవ స్మృతి ఛాయలు …………రచన……విజయ గోలి——————————————————–
స్వర్ణయుగపు పునాదులపై ..
దేశమాత కు సమాధి కడుతున్న ..
వర్తమానం తలుచుకుంటూ ,…భవిత నుహించలేక
మూసిన నా కనురెప్పల వెనుక కదులుతున్నాయి
నా తల్లి గత వైభవ..స్మృతి ఛాయలు …
కోటిసూర్యుల ధీటుగా వెలుగుచున్న నా తల్లి,
వేదభారతి రూపం నా కనుల నింపుచున్నాయి.
కాశ్మీరము నుండి కన్యాకుమారి వరకు
విస్తరించిన ఆ తల్లి విశ్వరూపము.
పుడమి విరిసిన హరిత వర్ణాలు
అమ్మ మేనికి అందాల నలముతున్నాయి .
జాలువారు నదీ నదముల జలధారలు
అమ్మకు సిగ పాయలై అలరుచున్నాయి .
ముత్యాల ముగ్గు లో దిద్దిన నీలాల మెరుపులు,
నింగినంటి జలతారు తీగలయి దిగి వచ్చి,
అమ్మ మేనుకు అంబరముగా అల్లుకున్నాయి .
హిమనగముల వెలుగు ,వజ్ర కిరీటమై వెలయ ,
కాశ్మీరు అందాలు అమ్మ నుదుటన
అరుణ బింబమై అలరుచుండే
అలనాటి హస్తిన వైభోగామంతా
అమ్మ ముక్కెర గా మెరయుచుండే .
భాగ్యనగరపు శోభ నడుమ
వడ్డాణమయి నిలిచియుండే ,
విజయనగరపు జయహేల
అమ్మ గళమున మాలగా అమరియుండే.
కనకపీఠమై కన్యాకుమారి వొదిగి
నిలిచెను అమ్మ పాదాలచెంత .
సస్యశ్యామల నా తల్లి
వెండి జాబిలి వలె వెలుగుచుండే,
వాసిగల రత్నాలు రాశి
పోసినయట్లు నవ్వుచుండే.
కరుణ నిండిన ఆ కనులు
కనకరాశుల వలె తోచుచుండే.
ఆరబోసిన రతనాలు ..
.శ్వేతవర్ణపు నీరెండలో ,
సప్తవర్ణాల హరివిల్లుగా.. భారతాంబకు ..
భక్తి నీరాజనాలెత్తుచున్నాయి…
భారతావని సకల చరాచరములు గళమెత్తి ..
అమ్మకు …జయగీతికలు పాడుచున్నాయి .
కనులనిండిన ఈ అపురూపం , కరిగిపోతుందేమో
మదినిండిన ఈ భాగ్యం జారిపోతుందేమో ,
కలవరముతో ….రెప్పలు …విప్పలేకున్నాను ….