గజల్. విజయ గోలి
ప్రతిరోజు మా ఇంటి ముందు పొగడ చెట్టుగుబురు లో ఒక కోయిల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎవరినో పిలుస్తున్నట్లు అరుస్తూనే వుంటుంది .. ఎక్కడా బదులు వినపడదు . …దానికి సరదాగా బదులిద్దామని నేను కూ …కూ…అని కూస్తే .. కాసేపు సమాధానముండదు .ఆ తరువాత గట్టిగా పోట్లాడినట్లుగా అరుస్తుంది …బహుశా నన్ను ఆపేయమని ..అనుకుంటా…నేను ఆపగానే మళ్ళీ తను తన స్వరంలో భావాలు మారుస్తూ కూస్తుంది …. దాని గొంతులో …ఒకసారి మధురత నింపుకుని ఆమనిగీతం ఆలపించినట్లు…ఒక్కొక్క సారి ఒక్కో భావం గోచరిస్తూంది ఒకసారి ఆర్తిగా పిలిచినట్లు.ఒకసారిప్రేమతో ఎదురు చూసినట్లు , వేదనతో వేచినట్లు
కంఠంలో కరకుదనం నింపినట్లు.ఎన్నో భావాలు విసుగు లేకుండా ప్రతి ఇరవై నిమిషాల కొకసారి ఐదునిమిషాలు ఆలపిస్తూనే వుంటుంది . విసుగు లేని ఆ ఆలాపన సాధనగా విజయం జరగుతుంది .ప్రతిరోజూ ఆ రాగాలు వింటున్న స్పందనతో. నా భావాలు నింపిన గజల్ …..
కోయంటూ పిలిచి పిలిచి అలిసేవే కోయిలా!
బదులివ్వని బంధాలను కొలిచేవే కోయిలా !
మదిమీటే స్వరాలలో వ్యధ ఏమో తెలియదులె
గళంలోన మధురిమలే నింపేవే కోయిలా,
రాగంలో యోగమేదొ పలుకుతుంది రవళిగా
గుండెలోన గుట్టుదాచి పాడేవే కోయిలా !
కాకిగూడు కబ్జాలో మనుషులకే గురువు గా
మమతలేక మధువులెలా ఒంపేవే కోయిలా ?
నీపాటల దారులలో వనాలలో వసంతం
విసుగు పడని ఆలాపన విజయమేలె కోయిలా!!