గజల్. విజయ గోలి
కార్యేషు దాసిగా కాలంతొ కలిసేవు కడదాక
సాలీడు గూడులో సంతసం వెతికేవు కడదాక
కరణేషు మంత్రిగా కదనాల నీ రచన ఎదురేది
అబలవే నీవన్న అలుసుతో నలిగేవు కడదాక
భోజ్యేషు మాతవై భువనాల ఆకలే తీర్చేవు
నీ కడుపు కోతలో యుగములే పొగిలేవు కడదాక
రూపేచ లక్ష్మిగా పుట్టింట నట్టింట మెప్పులే
అందమే శాపమై నిప్పులలొ కాలేవు కడదాక
శయనేషు రంభగా సొగసులే పంచేవు సొంపార
మంచు దుప్పటిలోన మరణమే చూసేవు కడదాక
క్షమయా ధరిత్రిగ ఓరిమినె కూరిమిగ తలిచేవు
కాలితో తన్నినా కరుణనే పంచేవు కడదాక
సృష్టియె నీవంటు అడుగుకో గీతనే గీసేరు
షట్కర్మ బంధాల బందీగ నిలిచేవు కడదాకా