శుభోదయం 🌹🌹🌹🌹🌹
గజల్. విజయ గోలి
కవనంపై కలమెందుకు అలిగిందో తెలియలేదు
శూన్యంలో కాలమెంత కరిగిందో తెలియలేదు
ఎదురు తిరిగె ఏకాంతం వెతలన్నీ తరిమేస్తూ
వెన్నెలెపుడు వేసవిపై గెలిచిందో తెలియ లేదు
ఆకాశం పొత్తిళ్ల లొ ఆదమరిచె చందమామ
ఉల్కతోటి కోరికెలా రాలిందో తెలియలేదు
చిరునామా సవరించుకు తిరిగి వచ్చె సంతోషం
మౌనమెపుడు మాటలుగా మారిందో తెలియలేదు
వెలుగురేక దూసుకొచ్చె విరితావుల తెమ్మెరగా
విజయమెలా మేలుకొలిపి నవ్విందో తెలియలేదు !!