కళ్ళు నవ్వుతున్నాయి* విజయ గోలి
పూవు కొక రంగుగా
రంగులన్నీ నవ్వుతున్నాయి
వనమంతా ..నవ్వుల సవ్వడి
పరిమళాల ..పవనాలు..
సుగంధాల వీవనలు వీస్తూ..
అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నాయి
ఆశగా ..ఆరాటంగా…
పూలన్నిటినీ…వడి నింపు కుంటున్నాను
వడిలో నిలవటం లేదు..
కొన్ని జారిపోతున్నాయి
కొన్ని ఎగిరి పోతున్నాయి
కొన్ని అందటం లేదు..
అందుకోవాలని ఆయాస పడుతున్నాను..
మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తున్నాను
తుళ్ళిపోయాయి.. రెప్పలు విప్పుకున్నాయి..
కల కాబోలు..కరిగిపోయింది
అదేమిటో…కొన్ని రంగులు మాత్రం…
నన్నంటుకునే ..వున్నాయి..
కొన్ని సువాసనలు …నన్నల్లుకునే వున్నాయి
ఇలను కలను చూసానో…
కలను ఇలను చూసానో …
తేరి చూసేలోపు ఇదే …నిజమంటూ…
నిన్ను …హత్తుకున్నవే నీవంటూ…
వేణు రాగాల రంగులలో…
కళ్ళు నవ్వుతున్నాయి …..కాంతులీనుతూ…