గజల్ విజయ గోలి
కాల సర్పమే కరోనాగ కాటువేస్తె ఓప తరమా
కారుచిచ్చులొ విశ్వమంత కాల్చేస్తే ఆప తరమా
కడ చూపులే చూడకనే కాటిలోన కాలుతుండగ
నీ గుండెలో సునామీలు సుడితిప్పితె ఆగ తరమా
పాపమేదో శాపమేదొ ఏమిరాతొ తెలియరాదుగ
బంధాలన్ని బావురంటు ఏడ్చేస్తే వినగ తరమా
ఎన్నిజన్మల ఋణమేమో ఎవరెవరో ఎత్తి వేయగ
మూక ఉమ్మడి దహనాలనె ఆచరిస్తే యెంచ తరమా
ఎవరికెవరమొ ఎదుటివాడు పగవాడిలా నిలబడుంటే
నీఅంటరాని తనమంటూ నాటివుసురె తవ్వ తరమా
ఈకులమతాల కుళ్ళులన్నీ కడిగేసిన మహామ్మారిగ
కంటికెపుడూ కానరాక అంటుకుంటె కావతరమా
ఊపిరాడకె ఉసురుపోయె పాపమెలా పంచవలెనో
కంచెలన్నియు చేనుమేస్తే కాలమహిమ తెగడ తరమా