కన్నయ్యా

గజల్ విజయ గోలి

కనులవిందు నీరూపం కలతతీరు కన్నయ్యా
వీడలేను నీధ్యానం నలతతీరు కన్నయ్యా

పాలకడలి పరవశాలు పరిమళించు నందనమే
అలరించే నీఅందం అలకతీరు  కన్నయ్యా

రాగముగా రంజిల్లగ నీమురళీ రవములలో
బృందావని పల్లవించు పాటతీరు కన్నయ్యా

అణువణువున నీవేగా అల్లరివై ఆటాడగ
అల్లుకోగ వల్లరినై సేదతీరు  కన్నయ్యా

పంచలేను పదుగురిలో మనసైనవి మధురిమలే
వివశ నౌదు నీ సన్నిధి విరులతీరు కన్నయ్యా

మేఘమాల మెరుపుతీగ సోయగాలు స్వల్పమే
గడ్డిపూవు నాదరించు ఆశతీరు కన్నయ్యా

కోరుకుంటి కైవల్యమే  కొసరుచుంటి చరణములే
విజయమివ్వు దరిజేరగ తపనతీరు కన్నయ్యా

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language