గజల్ విజయ గోలి
పాలపుంత వంపుతున్న వెలుగుధార మెరిసింది
తారలన్నీ ఒలకబోయు సొగసుధార కులికింది
శరత్కాల పున్నమిలో సెలయేరుల మిలమిలలొ
హేమంతపు చేమంతుల పసిడిధార విరిసింది
కన్యరాశి కాంతులలో కమనీయపు రంగులలొ
నక్షత్రపు నగిషీలా మెరుపుధార ఒలికింది
పాలమబ్బు దారులంట జిలుగుతెరల పల్లకీ
నవరాత్రుల సంబరమై నయనతార వెలిసింది
కాత్యాయని కొలువులో కామితాలు తీరగా
విజయదశమి వేడుకగా కనకధార కురిసింది